
మహేష్ బాబు కాలేజీ రోజుల్లో ఎలా చదివేవాడు. ఆయన చేసే చిలిపి పనులు ఏమైనా ఉన్నాయా? ఆయన ఎలాగూ ఇలాంటివి బయటకు చెప్పడు. ముసిముసిగా నవ్వేసి, రెండు-మూడు ముక్కల్లో తేల్చేస్తాడు. మరి మహేష్ టీనేజ్ అల్లర్లను బయటపెట్టే వారు ఎవరు?
మహేష్ తో కలిసి చదువుతున్న విష్ణు వర్థన్ ఈ విషయాల్ని ఒక్కొక్కటిగా బయటపెడుతున్నాడు. చెన్నైలో మహేష్, దర్శకుడు విష్ణు వర్థన్ ఒకే కాలేజ్. ఒకే కాలేజ్ మాత్రమే కాదు, ఒకటే బెంచ్ కూడా. తామిద్దరం కలిసి చేసిన అల్లరి నెక్ట్స్ లెవెల్ లో ఉండేదని, అదంతా కెమెరా ముందు చెప్పడం సాధ్యం కాదని సిగ్గుపడుతూ చెప్పాడు విష్ణువర్థన్.
ఓ చిన్న ఆకతాయి పనిని మాత్రం బయటపెట్టాడు. రాబోయే పరీక్షలకు సంబంధించి క్వశ్చన్ పేపర్ లీక్ అయిందని, అది ఎక్కడ అమ్ముతున్నారో తనకు తెలుసని మహేష్ బాబుతో చెప్పాడట విష్ణువర్థన్. దాంతో ఇద్దరూ వెళ్లి డబ్బులు పెట్టి ఆ క్వశ్చన్ పేపర్ కొన్నారంట.
కట్ చేస్తే, అది ఫేక్ క్వశ్చన్ పేపర్ అని.. తాము చదివిన ప్రశ్నలే ఎక్కువగా రావడంతో గట్టెక్కామని చెప్పుకొచ్చాడు. ఇలా మహేష్ తో తను చేసిన అల్లరిని బయటపెట్టాడు విష్ణు వర్థన్. పవన్ తో ‘పంజా’ సినిమా చేసిన ఈ డైరక్టర్, అన్నీ కుదిరితే మహేష్ తో మూవీ చేస్తానంటున్నాడు.