
హిట్ వస్తే క్రేజ్ వస్తుంది. ఫ్లాప్ వస్తే కెరీర్ పోతుంది. హీరోయిన్ల విషయంలో సింపుల్ ఫార్ములా ఇది. కానీ కొంతమంది హీరోయిన్లు దీనికి అతీతం. వరుస ఫ్లాపులొచ్చినా వాళ్లకు అవకాశాలు వస్తూనే ఉంటాయి. ‘మరొక్కసారి..’ అనే టైపులో ఇండస్ట్రీ వాళ్లను ఆదరిస్తూనే ఉంటుంది. ఇప్పుడు కృతి శెట్టి వంతు వచ్చింది.
ఈ బ్యూటీ హిట్ కొట్టి చాన్నాళ్లయింది. తాజాగా మనమే సినిమాతో ప్రేక్షకులముందుకొచ్చినప్పటికీ, అది శర్వానంద్ ఆశించిన స్థాయి విజయం కాదు. కృతిశెట్టికి కలిసొచ్చిందేం లేదు. తన సినిమా హిట్టయిందంటూ ప్రకటించుకొని అందరికీ ధన్యవాదాలు కూడా తెలిపిన కృతిశెట్టి, ఆ తర్వాత సైలెంట్ అయింది.
ఇప్పుడీ ముద్దుగుమ్మను మరో అవకాశం వరించింది. అన్నీ అనుకున్నట్టు జరిగిదే త్వరలోనే దుల్కర్ సల్మాన్ సరసన నటించే అవకాశం అందుకుంటుంది. దుల్కర్ సినిమాలో ఛాన్స్ అంటే పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు వస్తుంది, ఎట్ లీస్ట్ సౌత్ వరకు పాపులర్ అవ్వొచ్చు. ఇలాంటి హీరో సరసన ఛాన్స్ అందుకోబోతోంది కృతి.
త్వరలోనే సెల్వరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు దుల్కర్. రానా నిర్మాణంలో రాబోతున్న ఈ సినిమాలో కృతిని తీసుకున్నట్టు టాక్. కనీసం ఈ సినిమా అయినా ఆమె కెరీర్ ను నిలబెడుతుందేమో చూడాలి.