హీరోలు ప్రెస్ మీట్ కు ఎలా వస్తారో అందరికీ తెలిసిందే.. చెమట చుక్క పట్టకుండా లగ్జరీ కారులో అలా దిగుతారు. చుట్టూ బౌన్సర్లను పెట్టుకొని నేరుగా వేదిక వద్దకు వెళ్లిపోతారు. కానీ ఓ హీరో మాత్రం సైకిల్ పై ప్రెస్ మీట్ కు వచ్చాడు. అతడే కిరణ్ అబ్బవరం.
ఈ హీరో నటించిన తాజా చిత్రం ‘క’ విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా ప్రెస్ మీట్ కు కిరణ్ సైకిల్ పై వచ్చాడు. అలా అని ఇంటి నుంచి అనుకుంటే పొరపాటే. ప్రసాద్ ల్యాబ్స్ వరకు కారులో వచ్చి, అక్కడ తనకోసం సిద్ధంగా ఉన్న సైకిల్ ఎక్కి, మీడియా కెమెరాల కోసం సైకిల్ తొక్కాడు. పనిలోపనిగా హీరోయిన్ ను కూడా ఎక్కించుకున్నాడు.
కిరణ్ ఇదంతా చేసింది తన సినిమా ప్రచారం కోసమే. ‘క’ సినిమాలో పోస్ట్ మేన్ రోల్ పోషించాడు. ఇంటింటికీ సైకిల్ పై తిరుగుతూ ఉత్తరాలిచ్చే పాత్ర అది. అందుకే పోస్ట్ మేన్ డ్రెస్ లోనే సైకిల్ ఎక్కి ప్రచారం చేశాడు.
ఈమధ్య పెద్ద సినిమాల కంటే చిన్న సినిమాలకే వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. నిన్నటికినిన్న ‘పొట్టేల్’ సినిమా కోసం యూనిట్ ఎంత వినూత్నంగా ప్రచారం చేసిందో అందరం చూశాం. ఇప్పుడు ‘క’ కోసం కిరణ్ కూడా అదే పని చేస్తున్నాడు, అందర్నీ ఆకర్షిస్తున్నాడు.