
బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ నటించి, దర్శకత్వం వహించిన “ఎమెర్జెన్సీ” చిత్రం ఈ రోజు విడుదలైంది. అనేకసార్లు వాయిదాపడి మొత్తానికి ఈ శుక్రవారం థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమాకి సమీక్షలు మిశ్రమంగా వచ్చాయి.
కంగనా నటనని మెచ్చుకున్నారు క్రిటిక్స్. కథనంలో మాత్రం అంత దమ్ము లేదని తేల్చారు. ఐతే, అలాగని పూర్తిగా తీసిపారేయ్యాల్సిన చిత్రం కూడా కాదంట. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ స్థాయి తగ్గించే ప్రయత్నంగా ఈ సినిమా తీసినట్లు కనిపిస్తోంది అని క్రిటిక్స్ అంటున్నారు.
కాంగ్రెస్ వాళ్ళు, సామాన్య ప్రేక్షకులు చూడకపోయినా ఈ సినిమాని బీజేపీ కార్యకర్తలు చూస్తారని ట్రేడ్ పండితులు భావించారు. కానీ చిత్రంగా ఈ సినిమాకి మొదటి రోజు వచ్చిన కలెక్షన్లు మరీ ఘోరం. ఈ సినిమాకి టికెట్ రేట్లు కూడా తక్కువే. ఎందుకంటే ఈ రోజు నేషనల్ సినిమా డే. అందుకని మల్టిప్లెక్స్ లు ఈ చిత్రాన్ని కేవలం 112 రూపాయలకే ప్రదర్శించాయి. అయినా కూడా మొదటి రోజు ఓపెనింగ్ రాలేదు.
“ఎమెర్జెన్సీ” చిత్రం మొదటి రోజు దేశం మొత్తమ్మీద రెండున్నర కోట్ల వసూళ్లు అందుకొంది. ఇంత తక్కువ మొత్తం రావడంతో కంగనా కూడా షాక్ అయి ఉంటుంది అని చెప్పొచ్చు. ఈ “ఎమెర్జెన్సీ”ని అంత అర్జెంటుగా చూడాల్సిన పని లేదు అని జనం భావించినట్లు అనుకోవాలేమో.