అమర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు జీవితం మీద తెరకెక్కిన బయోపిక్ ‘ఘంటసాల ది గ్రేట్’. కృష్ణ చైతన్య టైటిల్ పాత్ర పోషించారు. ఈ సినిమాలో ఘంటసాల భార్య సావిత్రి పాత్రలో కృష్ణ చైతన్య భార్య మృదుల నటించారు. సిహెచ్ రామారావు దర్శకత్వంలో సిహెచ్ శ్రీమతి ఫణి నిర్మించారు. ఫిబ్రవరి 14న ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు: “నేను సినిమా కార్యక్రమాలకు వెళ్లను. అప్పుడప్పుడూ సినిమాలు చూస్తాను, ముఖ్యంగా పాత సినిమాలు చూస్తాను. ఘంటసాల గారి జీవితం గురించి నవ తరానికి, యువ తరానికి, నేటి తరానికి తెలియచెప్పే కార్యక్రమం కనుక వచ్చాను. ఘంటసాల వారి సమగ్ర జీవితాన్ని ఇతివృత్తంగా తీసుకుని సినిమా తీశామని, అన్ని విషయాలు స్పృశించామని చెప్పడంతో వచ్చాను. ఈతరం ఆయన జీవితం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. స్వాతంత్ర సమరయోధుడిగా, ప్రజా గాయకుడిగా, ప్రముఖ సంగీత దర్శకుడిగా, అన్నిటికి మించి అమర గాయకుడిగా దేశానికి, తెలుగు ప్రజలకు పరిచయస్తులు. వారి జీవితం ఆధారంగా తీసిన ‘ఘంటసాల ది గ్రేట్’ చిత్రాన్ని వీక్షించే అవకాశం లభించడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. భగవద్గీత శ్లోకాలు ఆయన పాడుతుంటే ప్రజలు అందరూ ఎంతో తన్మయత్వంతో వినేవారు. ఘంటసాల గారిపై సినిమా తీయడం సాహసం. ఎందుకంటే… సినిమా తీయడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అందుకని, నిర్మాత శ్రీమతి ఫణి గారిని అభినందిస్తున్నా.”
నారాయణమూర్తి: ”ఓ ఎన్టీఆర్, ఓ ఏయన్నార్, ఓ ఘంటసాల. ఎన్టీఆర్, ఏయన్నార్ ఉన్నంత కాలం ఘంటసాల ఉంటారు. ఆ మహనీయుడి చరిత్ర సినిమా తీసి జన్మ ధన్యం చేసుకుంటున్న దర్శకులు రామారావు గారికి, నిర్మాత ఫణి గారికి, ఘంటసాల పాత్రలో నటించిన తమ్ముడు కృష్ణ చైతన్యకు అభినందనలు. ఘంటసాల అంటే గానగంధర్వుడు.”
దర్శకులు సిహెచ్ రామారావు: ”ఘంటసాల పాట అందరికీ తెలుసు. ఆ పాట ఎంత గొప్పదో తెలుసు. కానీ, ఆయన వ్యక్తిత్వం చాలా కొంతమందికి తెలుసు. కృషితో నాస్తి దుర్భిక్షం, వినయంతో విద్య ప్రకాశిస్తుందని చెప్పడానికి నిలువెత్తు నిదర్శనం శ్రీ ఘంటసాల. ఆయన వ్యక్తిత్వాన్ని, ఆ జీవితాన్ని మా సినిమాలో చెప్పడం జరిగింది.”