దిల్ రాజు అనగానే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (SVC) అనే ఆయన నిర్మాణ సంస్థ గుర్తొస్తుంది. ఇటీవల ఆయన కూతురు హన్షిత, సోదరుడు కొడుకు హర్షిత్ రెడ్డి కలిసి దిల్ రాజు పేరుమీదనే ఒక బ్యానర్ స్థాపించారు. దిల్ రాజు ప్రొడక్షన్స్ పేరుతో “బలగం” సినిమాని మొదటి ప్రయత్నంగా తీశారు. అది మంచి విజయం సాధించింది. ఎంతో పేరు తెచ్చింది.
దాంతో ఈ బ్యానర్ పై కొత్త వాళ్లకు, కొత్త కథలకు ఎక్కువ అవకాశాలిస్తామని మరోసారి ప్రకటించారు దిల్ రాజు.
“దిల్ రాజు ప్రొడక్షన్స్ స్టార్ట్ చేసేటప్పుడు .. ఆ బ్యానర్‌లో చేసేదేదైనా యూనిక్‌గా చేయాలని అనుకున్నాం. బలగం అలాగే చేశాం. ఈ బ్యానర్ నుంచి బలగం, లవ్ మీ సినిమాలు వచ్చాయి. ఈ రెండు సినిమాలను కొత్త దర్శకులే చేశారు. భవిష్యత్తులో హరి, శాండి, శశి, సహా మరో ఇద్దరు కొత్త దర్శకులను పరిచయం చేయబోతున్నాం. దిల్ రాజు ప్రొడక్షన్స్ నుంచి కొత్త సినిమాలను, కొత్త దర్శకులను అందించాలనే చూస్తాం. అదే మా కోరిక. కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వాలనే ఈ బ్యానర్‌ను స్టార్ట్ చేశాం,” అని చెప్పారు ఆయన.
నిర్మాతలైన తన పిల్లలు హర్షిత్ రెడ్డి, హన్షితకు రాబోయే రోజుల్లో మరింత ఫ్రీడమ్ ఇస్తానని అంటున్నారు రాజు.