జర్నలిస్ట్ పై దాడి ఘటనలో మోహన్ బాబుపై కేసు ఫైల్ అవ్వడంతో, ఆయన ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ పెట్టుకున్నారు. దీనిపై హైకోర్టు విచారణ జరిపింది. మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. తుది తీర్పును సోమవారానికి వాయిదావేసింది.
మధ్యంతర బెయిల్ రాకపోవడంతో మోహన్ బాబు పరార్ అయ్యారంటూ మరోసారి వార్తలు గుప్పుమంటున్నాయి. ఆల్రెడీ అతడు పరారైనట్టు గతంలోనే వార్తలు రాగా, వాటిని మోహన్ బాబు ఖండించారు. ఇంట్లోనే ఉంటూ, చికిత్స పొందుతున్నట్టు తెలిపారు.
తాజాగా మరోసారి మోహన్ బాబు కనిపించడం లేదంటూ కథనాలు మొదలయ్యాయి. ఆయన దుబాయ్ కు పారిపోయారని కొంతమంది, తెలంగాణ పోలీసుల అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు ఆంధ్రాకు పారిపోయారని మరికొంతమంది చెప్పుకుంటున్నారు.
దీనిపై హైకోర్టు కూడా స్పందించింది. మోహన్ బాబు ఇక్కడే ఉన్నట్టు అఫిడవిట్ దాఖలు చేయాలని, ఆ తర్వాతే తుది తీర్పు ఉంటుందని స్పష్టం చేసింది. ఈ కేసుకు సంబంధించి మోహన్ బాబు అరెస్ట్ అవుతారా అవ్వరా అనే క్లారిటీ సోమవారం వస్తుంది.