పెద్ద హీరోల సినిమాల్ని మొదటి వారం రోజుల్లో సాధారణ టికెట్ రేట్లలో చూసే రోజులు పోయాయి. ప్రభుత్వాల నుంచి ప్రత్యేక అనుమతులు తెచ్చుకోవడం, టికెట్ రేట్లు పెంచుకోవడం, డబ్బులు పిండుకోవడం కామన్ ప్రాక్టీస్ అయిపోయింది.
ఇక సంక్రాంతి సినిమాలంటే చెప్పేదేం లేదు. ఆంధ్రాలో ఆల్రెడీ రేట్లు పెంచేశారు. ఊహించని విధంగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే ఫ్యామిలీ సినిమాకు కూడా టికెట్ రేట్లు పెంచేశారు. ఇక తెలంగాణలోనే పెంచడం ఆలస్యం.
కానీ నైజాంలో సాధారణ టికెట్ రేట్లకే డాకు మహారాజ్ సినిమాను చూసే అవకాశం ఏర్పడింది. అవును.. టికెట్ రేట్లు పెంచకుండానే నైజాంలో బాలకృష్ణ సినిమాను విడుదల చేస్తామని ప్రకటించాడు నిర్మాత నాగవంశీ.
తమ సినిమాకు టికెట్ రేట్లు పెంచమని, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడగలేదు నాగవంశీ. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న టికెట్ రేట్లు తమ సినిమాకు సరిపోతాయని ఆయన చెప్పడం కొసమెరుపు. సీఎంను కలవడం ఇష్టంలేక నాగవంశీ ఈ నిర్ణయం తీసుకున్నాడా లేక నిజంగానే బాలయ్య సినిమాకు పెట్టిన బడ్జెట్ కు సాధారణ టికెట్ రేట్లు సరిపోతాయా అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది.