“పుష్ప 2” ప్రీమియర్ షో వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోయిందని తెలుసుకున్న తాను, దర్శకుడు సుకుమార్ చాలా బాధపడ్డామని అల్లు అర్జున్ అన్నారు. బాధిత కుటుంబానికి భవిష్యత్తులో అన్ని విధాలుగా అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. తక్షణ సాయంగా రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తున్నట్లు ప్రకటించారు.
‘‘గత 20 ఏళ్లుగా ప్రేక్షకులతో కలిసి నా సినిమాలను ఎప్పుడూ థియేటర్‌లోనే చూశాను. ఈసారి కూడా ఆర్టీసీ ఎక్స్ రోడ్స్‌లో చూశాను. రేవతి గారు థియేటర్ వద్ద తొక్కిసలాటలో మరణించడం దురదృష్టకరం. ఆమె మరణంతో షాక్ అయ్యాం. వారి కుటుంబానికి అండగా ఉంటాను. ఆమె ఇద్దరు పిల్లల భవిష్యత్తును కాపాడేందుకు నేను వ్యక్తిగతంగా రూ. 25 లక్షలు విరాళంగా ఇస్తున్నాను, అని అల్లు అర్జున్ అన్నారు.
“ఈ బాధలో వారు ఒంటరిగా లేరని చెప్తున్నాను. ఆ కుటుంబాన్ని వ్యక్తిగతంగా కలుస్తానని నేను వారికి భరోసా ఇవ్వాలనుకుంటున్నాను,” అని స్పష్టం చేశారు.
“పుష్ప 2” సినిమా ప్రీమియర్ షోకి అల్లు అర్జున్ వెళ్లారు. బన్నీని చూసేందుకు జనం ఎగబడ్డారు. ఆ సమయంలో రేవతి, ఆమె కుమారుడు తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడ్డారు. రేవతి వెంటనే మృతి చెందగా, ఆమె కుమారుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.