‘మిస్ ఇండియా’ టైటిల్ గెలుచుకున్న తర్వాత సినిమాల్లోకి అడుగుపెట్టి పెద్ద హీరోయిన్లుగా మారిన వారి జాబితా పెద్దదే. అదే లక్ష్యంతో అడుగుపెట్టింది తెలుగు భామ… వారణాసి మానస. ఆమె నటించిన మొదటి చిత్రం.. దేవకి నందన వాసుదేవ. అశోక్ గల్లా సరసన నటించింది. ఈ వీకెండ్ విడుదల కానున్న తన మొదటి సినిమా గురించి ఈ భామ చెప్పే ముచ్చట్లు..
మొదటి అవకాశం ఎలా వచ్చింది?
నేను హైదరాబాదులో పుట్టాను కానీ బాల్యం అంతా మలేషియాలో జరిగింది. మళ్ళీ హైదరాబాదులో ఇంజనీరింగ్ చేశాను. ఓ కార్పొరేట్ కంపెనీలో కొన్నాళ్ళు జాబ్ చేశాను. ఆ తర్వాత మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని, మిస్ ఇండియా టైటిల్ గెలిచాను. సినిమాలపై ఆసక్తి కలగడంతో నటిగా మారాను. కొన్ని ఆడిషన్స్ తర్వాత “దేవకి నందన వాసుదేవ”లో అవకాశం వచ్చింది.
మొదటి సినిమా, మొదటి పాత్ర గురించి?
‘దేవకి నందన వాసుదేవ’ కమర్షియల్ డివైన్ థ్రిల్లర్. మొదటి చిత్రమే ఇలాంటి కథాబలం ఉన్న సినిమా కావడం అదృష్టం. ఇందులో నేను ‘సత్యభామ’ అనే విజయనగరం అమ్మాయిగా నటించాను. కథ కూడా విజయనగరం నేపథ్యంగానే ఉంటుంది. కష్టాలను ధైర్యంగా ఎదుర్కొనే భామ… సత్యభామ. అలాగే చాలా ఫన్నీగా ఉంటుంది కథను మలుపు తిప్పే హీరోయిన్ పాత్ర. పాటల కోసమే ఉన్న రోల్ కాదు.
నేర్చుకున్న విషయాలు, ఎదుర్కున్న ఇబ్బందులు?
మొదటి సినిమా అన్నప్పుడు కొన్నిఇబ్బందులు ఉంటాయి. ఇందులో నాది పల్లెటూరి అమ్మాయి పాత్ర. ఆ బాడీ లాంగ్వెజ్, ఆ యాసలో డైలాగులు చెప్పడం ఛాలెంజింగ్ గా అనిపించింది. అలాగే చాలా విషయాలు నేర్చుకున్నాను.
ఎలాంటి సినిమాలు చెయ్యాలని కోరిక?
రోమాన్స్, కామెడీ, మిస్టరీ థ్రిల్లర్ నాకు ఇష్టం. కథ బావుంటే ఏదైనా చేస్తాను.
చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే ఇష్టమా?
మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, వెంకటేష్, నాగార్జున సినిమాలు ఎక్కువగా చూసేదాన్ని. గత నాలుగేళ్ళుగా అన్ని సినిమాలు చూస్తున్నాను.
ఇంకా ఏవైనా ఒప్పుకున్నారా?
యువీ క్రియేషన్ నిర్మిస్తోన్న ‘కపుల్ ఫ్రెండ్లీ’ అనే సినిమా చేస్తున్నాను.