
రీతువర్మ తెలుగు అమ్మాయి. తెలుగులో అనేక సినిమాల్లో చేసినా ఆమెకి ఇంకా సరైన క్రేజ్ రాలేదు. ఒకే తీరు పాత్రలు చేయడమే కారణం. ఈ నెల 26న వస్తోన్న “మజాకా” గురించి, తన కెరీర్ గురించి ఈ భామ మాట్లాడింది.
మజాకా గురించి చెప్పండి?
“మజాకా” సినిమా చెయ్యడానికి కారణం వినోదం. సినిమాలో చాలా ఫన్ ఉంటుంది. రచయిత ప్రసన్న గారు ఈ కథ చెప్పినపుడే చాలా ఎంటర్ టైనింగ్ గా అనిపించింది. కథలో హీరోయిన్లకు చాలా ఇంపార్టెన్స్ వుంది. సెకండ్ హాఫ్ లో నాకు రావు రమేష్ గారికి ఓ సింగిల్ టేక్ సీన్ ఉంది. రావు రమేష్ గారు డబ్బింగ్ పూర్తి చేసి ఫోన్ చేసి ఆ సీన్ గురించి మాట్లాడారు. “చాలా అద్భుతంగా చేశావ్ అమ్మా..16 నా ఏళ్ల కెరీర్ లో అలాంటి సీన్ చూడలేదు” అని ఆయన చెప్పడం గొప్ప అచీవ్ మెంట్ గా భావిస్తాను. కాలేజ్ గర్ల్ గా కనిపిస్తాను ఈ సినిమాలో కానీ క్యారెక్టర్లో ఒక ట్విస్ట్ ఉంది. ఇప్పటివరకు అలా చెయ్యలేదు. సందీప్ చాలా పాజిటివ్ పర్శన్. లవ్లీ కోస్టార్. అలాగే అన్షు గారితో యాక్ట్ చేయడం బావుంది.
మీకు అవకాశాలు ఎందుకు తగ్గాయి? మీరు గ్లామర్, కిస్ సీన్లకు వ్యతిరేకమా?
నేను ముద్దు సీన్లు చెయ్యను అనేది అపోహ. కథలో డిమాండ్ ఉండి, కథకు తగ్గట్లుగా అయితే చేస్తాను. గ్లామర్ షోకి కానీ, ముద్దు సీన్లకు వ్యతిరేకం కాదు. బహుశా నేను అవి చెయ్యను అని చాలామంది దర్శక, నిర్మాతలు భావిస్తున్నట్లు ఉన్నారు. అందుకే, అవకాశాలు అంతగా రావడం లేదు. కథలో అవి అవసరం అనుకుంటే చెయ్యను అని చెప్పను.
మరి ఈ కెరీర్ పట్ల సంతృప్తి ఉందా?
చాలా హ్యాపీగా ఉన్నాను. నటిగా చాలా మంచి సినిమాలు, పాత్రలు చేశాను.స్వాగ్ లాంటి సినిమాల ఫలితాలు నిరాశపర్చినా అందులో పాత్ర చేసినందుకు గర్వంగా ఉంది. గుర్తు పెట్టుకునే కొన్ని పాత్రలు నా కెరీర్ లో దక్కాయి.
మీకు ఎలాంటి పాత్రలు చెయ్యాలని ఉంది?
నాకు ఫైటింగ్ లతో కూడిన మంచి యాక్షన్ పాత్ర చెయ్యాలని ఉంది. అలాగే పూర్తి స్థాయి పీరియడ్ పాత్ర చెయ్యాలని కోరిక చేయాలని వుంది.

అందరూ సీక్వెల్స్ చేస్తున్నారు కదా. మీ సినిమాల్లో ఏదైనా దానికి సీక్వెల్ చెయ్యాలని ఉందా ?
పెళ్లి చూపులు 2″ చేస్తే బాగుంటుంది. తరుణ్ భాస్కర్ ప్లాన్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు విజయ్ దేవరకొండ పెద్ద హీరో అయిపోయాడు. కానీ, ఆ సినిమాకి సీక్వెల్ బాగుంటుంది అని నా ఆలోచన. తరుణ్ తీస్తానంటే విజయ్ ఒప్పుకుంటాడు. నేను కూడా చేస్తాను.
తదుపరి చిత్రాలు?
తెలుగులో ఓ మల్టీ స్టారర్ మూవీ సైన్ చేశాను. త్వరలోనే ప్రకటన ఉంటుంది. అలాగే ఓ వెబ్ సిరిస్ చేశాను. అది జియో హాట్ స్టార్ లో రిలీజ్ కానుంది.