ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తాజాగా అమరావతిలో మీడియాతో ముచ్చటించారు. అల్లు అర్జున్ అరెస్ట్ సహా తన సినిమాల గురించి మాట్లాడారు. అందులో కొన్ని ప్రధాన అంశాలు….
అల్లు అర్జున్ అరెస్ట్
“అల్లు అర్జున్ అంశం గోటితో పోయేదానిని గొడ్డలి వరకు తెచ్చుకున్నారు అనిపించింది. తెలంగాణ ప్రభుత్వం చాలా గౌరవప్రదంగా, మర్యాద పూర్వకంగా ఉంది సినిమా రంగంతో. టికెట్ రేట్లు పెంచారు. బెనిఫిట్ షోలు ఇచ్చారు. రేవంత్ రెడ్డికి మంచి విజన్ ఉంది. ఆయన ఒక ఫిలాసఫీ ఉంది. ఎంతటి వారు అయినా చట్టం ముందు సమానమే అనేది ఆయన ఫిలాసఫీ. దాని ప్రకారమే అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారు.”
కొన్ని తప్పులు జరిగాయి!
“అల్లు అర్జున్ థియేటర్ కి వెళ్లి చూడడం తప్పు కాదు. ప్రతి హీరో ప్రజల స్పందన తెలుసుకోవాలి అనుకుంటారు. మా అన్నయ్య ముసుగు వేసుకొని ఒంటరిగా వెళ్లి చూసి వచ్చేవారు. నేను మొదట్లో వెళ్ళాను కానీ తర్వాత మానేశా. అల్లు అర్జున్ వెళ్లదానికి ముందస్తు ఏర్పాట్లు జరిగి ఉండాల్సింది. ఎవరైనా అల్లు అర్జున్ స్టాఫ్ కానీ, సినిమా హాలు వాళ్ళు కానీ ముందుగా చెప్పి ఉండాలి. ఒకవేళ అల్లు అర్జున్ కి తొక్కిసలాట గురించి చెప్పినా అది సరిగా వినపడకపోవచ్చు. అక్కడ అలాగే ఉంటుంది పరిస్థితి. పోలీసులను తప్పు పట్టను కానీ థియేటర్ వాళ్ళు కానీ, నిర్మాణ సంస్థ కానీ, హీరో టీం కానీ మరింత బెటర్ గా హ్యాండిల్ చేసి ఉండాల్సింది.”
హీరోని ఒంటరిని చేశారు
“బాధిత కుటుంబం ఇంటికి ఎవరో ఒకరు వెంటనే వెళ్లి మేము తోడున్నాం అని చెపితే ఇంత జరిగేది కాదు. సహాయనుభూతి విషయంలో తప్పు జరిగినట్లు కనిపించింది. అభిమానులకు అభివాదం చేయాలి అనే ఆలోచన ప్రతీ హీరోకి ఉంటుంది. అల్లు అర్జున్ ని ఆ విషయంలో తప్పు పట్టలేం. కేవలం హీరోని బ్లేమ్ చేసే పద్దతి సరి కాదు. సినిమా ఒక సమిష్టి ప్రయత్నం. అతన్ని ఒక్కరినే నిందించడం, ఈ విషయంలో బన్నీని ఒంటరి చెయ్యడం నచ్చలేదు.”
సినిమా రంగం మారాలి
“సినిమా రంగం పని చేసే విధానం మార్చుకోవాలి. రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఇండస్ట్రీ పూర్తిగా ఇన్వాల్వ్ అయి పని చేయాలి, ఇండస్ట్రీ హోదా రావాలంటే మరిన్ని మార్పులు జరగాలి. ఏజెన్సీ ప్రాంతాల్లో మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి. సినిమాకు సంబంధించి స్కూల్స్ రావాలి.”
నా వాళ్ళని చూసుకోవాలి కదా!
“నాతో కలిసి పని చేసిన వారిని నేను చూసుకోవాలి. నా కోసం, నాతో పని చేసింది వీళ్ళే. నాగబాబుకు ఎంఎల్సీ ఇవ్వాలని నా ఉద్దేశం. జనసేన ఇప్పుడే పుడుతున్న పార్టీగా అనుకోండి. నాగబాబును ఎంఎల్సీ చేసిన తర్వాత మంత్రిని చేసే విషయం ఆలోచిస్తారు. రాజ్యసభ సీటును నాగబాబు త్యాగం చేశారు.”
ఓజి, హరి హర వీరమల్లు
“ఓజి …. 1980, 90లలో జరిగే కథ. OG అంటే..ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ అని అర్థం. అభిమానులు ఎక్కడికి వెళ్లినా.. OG. .. OG అని అరుస్తున్నారు. అవి నాకు బెదిరింపుల్లాగా అనిపిస్తున్నాయి. అన్ని సినిమాలకి నేను డేట్స్ ఇచ్చాను. వాళ్లు సరిగా వాడుకోలేదు. అందుకే లేట్ అయ్యాయి. హరిహర వీరమల్లు ఎనిమిది రోజుల షూటింగ్ పెండింగ్ ఉంది అన్ని సినిమాలూ ఒక్కొక్కటి గా పూర్తి చేస్తాను.”