
ఇటీవల విడుదలైన కొన్ని సినిమాలు, వాటి ఫలితాలను విశ్లేషిస్తే సీనియర్ హీరోలని ప్రేక్షకులు కొన్ని పాత్రల్లోనే చూసేందుకు ఇష్టపడుతున్నారు. వారి వయసుకు తగ్గ పాత్రల్లో చూడాలనుకుంటున్నారు ప్రేక్షకులు.
70కి చేరువలో ఉన్న చిరంజీవి, 70 ప్లస్ కమల్ హాసన్, రజినీకాంత్, అలాగే 60 దాటిన బాలయ్య, వెంకటేష్, నాగార్జున వంటి హీరోలు ‘కుర్ర’భామలతో రొమాన్స్ చేస్తామంటే ప్రేక్షకులు ఒప్పుకోవడం లేదు.
తాజాగా వెంకటేష్ “సంక్రాంతికి వస్తున్నాం” అనే సినిమాతో భారీ విజయం అందుకున్నారు. ఈ సినిమాలో వెంకటేష్ కి ఒక భార్య, ఒక మాజీ ప్రియురాలు ఉంది. కానీ, వెంకటేష్ ని ఈ సినిమాలో చాలా వయసు ఎక్కువ ఉన్న వాడిగా, అలాగే లేట్ గా పెళ్లి చేసుకొని ఆరేళ్లలో నలుగురు పిల్లలను కనేసిన అంకుల్ గా కనిపించారు. వెంకటేష్ పూర్తిగా తన వయసుకు తగ్గ పాత్ర చెయ్యలేదు కానీ జనం నవ్వగలిగే, ఒప్పుకునే పాత్రనే చేశారు.
“భోళా శంకర్” వంటి సినిమాల్లో మెగాస్టార్ – తమన్నా, మెగాస్టార్ – శ్రీముఖిల రొమాన్స్ ని చూసి జనం ఎబ్బెట్టుగా ఫీల్ అయింది అందుకే. ఇప్పుడు నటిస్తున్న “విశ్వంభర”లో 40 ఏళ్ల త్రిష ఆయనికి జోడిగా నటిస్తోంది. అలాగే, శ్రీకాంత్ ఓదెలతో చేసే సినిమాలో తనకి జోడీ లేకుండా చిరంజీవి నటిస్తారని టాక్.
చిరంజీవికి ముందే నందమూరి బాలకృష్ణ మేలుకున్నారు. ఆయన దాదాపు ప్రతి సినిమాలో ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఒక పాత్ర తన వయసుకు తగ్గట్లుగా ఏజ్డ్ గా, ఇంకో పాత్రతో పాటలు, సరసం అవీ చేస్తున్నారు. “భగవంత్ కేసరి”లో కాజల్ తో పెద్దగా రొమాన్స్ లేదు. “డాకు మహారాజ్”లో ప్రగ్య జైస్వాల్ తో డ్యూయెట్లు లేవు. ఆమె ఆయన భార్యగా నటించింది. “దబిడి దబిడి”లు ఐటెం భామలాంటి ఊర్వశి రౌతేలాకి అప్పచెప్పారు.


“విక్రమ్” సినిమాతో కమల్ హాసన్ ఈ కొత్త పంథాకు శ్రీకారం చుట్టారు. “విక్రమ్”కి ముందు కమల్ హాసన్ కూడా తన వయస్సుని మరిచి రొమాంటిక్ సీన్లు చేశారు. కానీ, “విక్రమ్”లో మాత్రం “తాతయ్య”గా నటించారు.ఆ సినిమాలో ఆయనకు జోడీనే లేదు. అది బ్లాక్ బస్టర్ అయింది. కమల్ నుంచి స్ఫూర్తి పొందారు రజినీకాంత్. “జైలర్”లో తాతగా నటించారు రజినీకాంత్. రమ్యకృష్ణ ఆయన భార్యగా నటించినా రొమాన్స్ లేదు వారి మధ్య. “జైలర్” తమిళనాట అన్న రికార్డులను తుడిచిపెట్టింది. ఆ తర్వాత వచ్చిన “వేట్టాయాన్”లో కూడా రజినీకాంత్ కి హీరోయిన్ జోడి లేదు. మంజు వారియర్ ఆయన భార్యగా నటించినా ఆమె పాత్ర నామమాత్రం.
ఇక నాగార్జున ఇప్పుడు ధనుష్ హీరోగా నటిస్తున్న “కుబేర”లో కీలక పాత్రలో, అలాగే రజినీకాంత్ మూవీ “కూలీ”లో కూడా నెగెటివ్ ఛాయలున్న కీలక పాత్రలో కనిపించనున్నారు. ఆయన తన రూట్ ఇలా మార్చుకున్నారు.