
కొందరు హీరోయిన్లు ముఖ్యంగా బాలీవుడ్ భామలు తాము హీరోలకు సమానం అని భావిస్తున్నారు. అందుకే, హీరోలకు సమానంగా తమకు పారితోషికం కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకప్పుడు 5,6 కోట్లు తీసుకున్న బాలీవుడ్ టాప్ హీరోయిన్లు ఇప్పుడు 20 కోట్లు డిమాండ్ చేస్తున్నారు. ప్రభాస్ హీరోగా సందీప్ వంగా తీస్తోన్న “స్పిరిట్” సినిమా కోసం దీపిక పదుకోన్ ఏకంగా 40 కోట్లు డిమాండ్ చేసింది అని బాలీవుడ్ మీడియా వార్తలు. నిజంగా అంత డిమాండ్ చేసిందా అన్నది తెలియదు కానీ ఇటీవల చాలామంది హీరోయిన్లు 10 కోట్లకు తక్కువ కాకుండా అడుగుతున్నారు అనేది నిజం.
పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించిన రష్మిక వంటి భామలు 5 కోట్లకు మించి తీసుకోవడం లేదు కానీ సరైన హిట్ లేని బాలీవుడ్ అగ్ర హీరోయిన్లు మాత్రం 20 కోట్లు అడుగుతున్నారు. దాంతో వాళ్లకు నిజంగా అంత సీను ఉందా అని కొందరు ఫిలింమేకర్స్ డైరెక్ట్ గా ప్రశ్నిస్తున్నారు.
ఈ రోజుకీ ఇండియన్ సినిమా హీరో చుట్టే తిరుగుతుంది. రాజమౌళి, భన్సాలీ, ప్రశాంత్ నీల్ వంటి కొందరు దర్శకులకు మాత్రమే హీరోలకు సమానంగా క్రేజ్ ఉంది. వాళ్ళ పేరు మీద కూడా సినిమాలకు భారీ ఓపెనింగ్స్ వస్తాయి. కానీ ఏ హీరోయిన్ కూడా సొంతంగా తమ పేరుతో కానీ, తమ క్రేజ్ తో కానీ ఓపెనింగ్ తీసుకురావడం లేదు.
ఉదాహరణకు…. ఇటీవల అలియా భట్ ‘జిగ్ర’ అనే హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా చేసింది. హిందీలో, తెలుగులో భారీ ఎత్తున విడుదల చేసింది. ఈ సినిమాకి మొదటి వీకెండు వచ్చిన ఓపెనింగ్ 20 కోట్లు కూడా దాటలేదు. మొదటి వీకెండ్ తమ పేరు మీద 20 కోట్ల ఓపెనింగ్ కూడా తీసుకురాలేని ఈ బాలీవుడ్ హీరోయిన్లకు 20 కోట్లు ఇవ్వాలా అనే ప్రశ్న మొదలైంది.
దీపిక పదుకోన్ సొంతంగా తన పేరు మీద ఇటీవల కాలంలో ఓపెనింగ్ తీసుకురాలేదు.
బాలీవుడ్ లో ప్రస్తుతం ఒక్క శ్రద్ధా కపూర్ కి మాత్రమే సొంతంగా భారీ ఓపెనింగ్ తీసుకొచ్చే సత్తా ఉంది. ఆమె మాత్రం దీపికలా 30, 40 కోట్లు అడగడం లేదు. 10, 15 కోట్లు మాత్రమే తీసుకుంటోంది.
ALSO READ: Did Deepika Padukone demand Rs 40 Cr for ‘Spirit’?

ప్రస్తుతం రాజమౌళి తాను మహేష్ బాబుతో తీస్తున్న సినిమాలో ప్రియాంక చోప్రాని హీరోయిన్ గా తీసుకున్నారు. ఈ సినిమాకోసం ఆమెకి ఏకంగా పాతిక కోట్లు ఇస్తున్నారు. ఆమె వల్ల అమెరికా, గ్లోబల్ మార్కెట్ కలిసి వస్తుంది అని రాజమౌళి భావన. ఆమె వల్ల ఓపెనింగ్ రాదు కానీ ఓటిటి డీల్స్, అమెరికా మార్కెట్ కి ఆమె పేరు ఉపయోగపడుతుంది అనేది ఆలోచన. అందుకే ఆమెకి అంత మొత్తం ఇస్తున్నారు.
హీరోలకైనా, హీరోయిన్లకైనా వాళ్ళ పేరు మీద ఓపెనింగ్ రాకపోతే వాళ్లకు (హీరోలకు, హీరోయిన్లకు ఇద్దరకీ) భారీగా పారితోషికం ఇవ్వడం దండగ. సినిమా ఆడినా, ఆడకపోయినా ఎవరైతే తమ క్రేజ్ తో కనీస కలెక్షన్లు రాబడుతారో వాళ్లే స్టార్స్. వాళ్ళకే హై రెమ్యూనరేషన్ ఇవ్వాలి.