నవంబర్ గడిచిపోయింది. డిసెంబర్ లోకి వచ్చేశాం. మరి నవంబర్ బాక్సాఫీస్ పరిస్థితేంటి? ఈ నెలలో ఒక్కటంటే ఒక్క హిట్ మాత్రమే పడింది.
మొదటివారంలో ఏకంగా 10 సినిమాలు రిలీజయ్యాయి. వీటిలో ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ అనే సినిమా కూడా ఉంది. నిఖిల్ నటించిన ఈ సినిమా డిజాస్టర్ అయింది. ఈ మూవీతో పాటు వచ్చిన ‘ధూం ధాం’, ‘జితేందర్ రెడ్డి’, ‘బ్లడీ బెగ్గర్’, ‘ఈ సారైనా’, ‘ది షార్ట్ కట్’, ‘ఆదిపర్వం’, ‘జాతర’, ‘వంచన’, ‘రహస్యం ఇదం జగత్’ లాంటి సినిమాలన్నీ పోయాయి.
రెండోవారంలో ‘మట్కా’, ‘కంగువా’ వచ్చాయి. రెండూ పెద్ద సినిమాలే. కానీ రెండూ వేటికవే ఫ్లాపులుగా నిలిచాయి. నవంబర్ నెలలో గట్టిగా ప్రచారం చేసిన సినిమాలేమైనా ఉన్నాయంటే అవి ఇవే. కానీ ఆ ప్రచారం వీటికి పనికిరాలేదు. వరుణ్ తేజ్ కు ఫ్లాప్ తప్పలేదు.
మూడో వారంలో ‘మెకానిక్ రాకీ’ వచ్చింది. విశ్వక్ నటించిన ఈ సినిమా ఫ్లాప్. ప్రశాంత్ వర్మ కథ అందించిన ‘దేవకీ నందన వాసుదేవ’ అనే మరో సినిమా కూడా డిజాస్టర్ అయింది. ఈ వారం వచ్చిన ‘జీబ్రా’ సినిమా మాత్రం కాస్త ఊపందుకుంది. మొదటి రోజు నెగెటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ సినిమా కోలుకుంది.
నాలుగో వారం ‘రోటీ కపడా రొమాన్స్’, ‘రణగల్’, ‘మెగా ఫ్యాన్’, ‘ఝాన్సీ ఐపీఎస్’ లాంటి సినిమాలొచ్చాయి. ఇవన్నీ వేటికవే ఫ్లాపులుగా నిలిచాయి. ఇలా నవంబర్ మాసంలో అన్నీ ఫ్లాపులుగా మిగిలాయి.