ఒకప్పుడు తమిళ్ లో రూపొందిన ప్రతి సినిమా తెలుగులో డబ్ అయి విడుదల అయ్యేది. రజినీకాంత్, కమల్ హాసన్, విక్రమ్, సూర్య, కార్తీ వంటి తమిళ బిగ్ స్టార్స్ కి తెలుగులో ఉన్న మార్కెట్ అంతా ఇంతా కాదు. మలయాళ సినిమాలు ఇంతకుముందు అడపాదడపా మాత్రమే వచ్చేవి.
ఎక్కువగా మలయాళంలో హిట్ సినిమాల రీమేక్ రైట్స్ కొని మన తెలుగులో మళ్ళీ తీసేవారు. కానీ ఇటీవల ఆ ట్రెండ్ మారింది. వాటి స్థానంలో డబ్బింగ్ హడావిడి మొదలైంది.
అక్కడ హిట్ అయిన ప్రతి మలయాళ సినిమా తెలుగులోకి డబ్ అవుతోంది. “2018”, “ప్రేమలు”, “భ్రమయుగం” , “కింగ్ ఆఫ్ కోతా”, “ది గోట్ లైఫ్” వంటి చిత్రాలు ఇటీవల విడుదల అయ్యాయి. అందులో కొన్ని మంచి సక్సెస్ సాధించాయి. ఇక ఈ వీకెండ్ “మంజుమ్ముల్ బాయ్స్” కూడా విడుదల అవుతోంది.
దుల్కర్ సల్మాన్, పృధ్వీరాజ్ సుకుమారన్ లాంటి హీరోలు తమ సినిమాల్ని మలయాళంతో పాటు నేరుగా తెలుగులోకి కూడా రిలీజ్ చేస్తున్నారు. దుల్కర్ ఇప్పటికే తెలుగులో “సీతారామం”, “మహానటి” చిత్రాలతో తెలుగులో పాపులర్ అయ్యారు. పృథ్వీరాజ్ సుకుమారన్ “సలార్”లో ప్రభాస్ స్నేహితుడిగా నటించి క్రేజ్ తెచ్చుకున్నారు.
మమ్మూట్టి, మోహన్ లాల్ లకు ఎప్పటి నుంచో తెలుగులో మంచి క్రేజ్ ఉంది. వాళ్ళు కూడా తెలుగులో నటించారు. ఇక “పుష్ప”లో నటించి ఫహద్ ఫాజిల్ కూడా తెలుగులో పాపులర్ అయ్యారు. సో, త్వరలో అతని సినిమాలు కూడా డబ్ అవుతాయి.
మొత్తమ్మీద, తెలుగులో నయనతార, నిత్య మీనన్, అనుపమ పరమేశ్వరన్, సంయుక్త మీనన్, అమలా పాల్ వంటి కేరళ కుట్టిలే కాదు మలయాళ చిత్రాల జోరు కూడా పెరుగుతోంది.