ప్రస్తుతం ఇటు తెలుగులో, అటు బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తున్న హీరోయిన్ల సంఖ్య పెరుగుతోంది. ఒక అరడజను హీరోయిన్లు క్రమం తప్పకుండా తెలుగులో సినిమాలు చేస్తూ హిందీ కెరీర్ కంటిన్యూ చేస్తున్నారు. వారే… కియారా అద్వానీ, రష్మిక మందాన, జాన్వీ కపూర్, దిశా పటాని, మృణాల్ ఠాకూర్. తాజాగా సాయి పల్లవి, కీర్తి సురేష్ కూడా ఈ లిస్ట్ లో చేరొచ్చు. వీరు ఇప్పటికే బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు.
రష్మిక మందాన
తెలుగులో రష్మిక మందాన నెంబర్ వన్ హీరోయిన్. ఆమె చేతిలో ప్రస్తుతం తెలుగులో ఉన్న చిత్రాలు: పుష్ప 2, కుబేర, ది గర్ల్ ఫ్రెండ్. ఇక హిందీలో ఆమె చేతిలో సల్మాన్ ఖాన్ సరసన “సికిందర్” ఉంది. అలాగే విక్కి కౌశల్ తో కలిసి “చావా” అనే సినిమా చేస్తోంది.
ఒకేసారి రష్మిక ఇటు తెలుగులో మూడు సినిమాలు, హిందీలో రెండు సినిమాల్లో నటిస్తోంది.
కియారా అద్వానీ
బాలీవుడ్ లో అగ్ర హీరోయిన్ గా కొనసాగుతోంది కియారా అద్వానీ. అందం, అభినయం కలిగిసిన ఈ బ్యూటీకి హిందీలో అనేక బడా చిత్రాలు ఉన్నాయి. “డాన్ 3”, “వార్ 2” వంటి బిగ్ హిందీ సినిమాల్లో ఆమె నటిస్తోంది. అలాగే యష్ హీరోగా రూపొందుతోన్న “టాక్సిక్” కూడా ఒప్పుకొంది.
ఇక తెలుగులో ఆమె చేతిలో “గేమ్ ఛేంజర్” ఉంది. ఇలా ఒకేసారి తెలుగు, హిందీలో సినిమాలు చేస్తోంది ఈ భామ. తెలుగులో ఇప్పటికే ఆమె రెండు సినిమాల్లో నటించింది. “గేమ్ ఛేంజర్” ఆమెకి మూడో తెలుగు చిత్రం.
జాన్వీ కపూర్
జాన్వీ కపూర్ నటించిన తెలుగు సినిమా ఇంకా విడుదల కాలేదు. కానీ ఆమె ఇప్పుడు బాలీవుడ్ కన్నా టాలీవుడ్ లోనే బిజీగా ఉంది అనడంలో సందేహం అక్కర్లేదు. తెలుగులో ఆమె రెండు బడా చిత్రాల్లో నటిస్తోంది. ఒకటి ఎన్టీఆర్ సరసన ‘దేవర’, మరోటి రామ్ చరణ్ తో బుచ్చిబాబు దర్శకత్వంలో ఇంకా పేరు పెట్టని స్పోర్ట్స్ డ్రామా.
బాలీవుడ్ లో ఆమె ఇప్పటికే పలు చిత్రాల్లో నటించింది. మరో రెండు బాలీవుడ్ చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి. అలాగే ప్రస్తుతం “మిస్టర్ అండ్ మిస్సెస్ మహి” అనే హిందీ సినిమాని ప్రమోట్ చేస్తోంది. జాన్వీ కపూర్ కూడా తెలుగు, హిందీ సినిమాల కెరీర్ ని బ్యాలెన్స్ చేసుకుంటోంది.
దిశా పటాని
దిశా పటాని నటించింది మొదట టాలీవుడ్ లోనే. కానీ ఇక్కడ ఆమెకి మొదట హిట్ రాలేదు. దాంతో బాలీవుడ్ కి వెళ్లి అక్కడ గ్లామర్ అంతా ఒలకబోసి సెక్సీ క్వీన్ గా పేరొందింది. ఇప్పుడు ఆమె హిందీలో నటిస్తూనే తెలుగులో నటిస్తోంది. ఆమె తెలుగులో నటించిన రెండో చిత్రం “కల్కి 2898AD” విడుదలకి సిద్ధంగా ఉంది. ఇక తమిళ్ లో సూర్య సరసన “కంగువా” అనే చిత్రం పూర్తి చేసింది.
మృణాల్ ఠాకూర్
మృణాల్ ఠాకూర్ తెలుగులో ఇప్పటికే మూడు సినిమాల్లో నటించింది. అందులో “హాయ్ నాన్న”, “ఫ్యామిలీ స్టార్” రీసెంట్ గా విడుదలయ్యాయి. ఇక త్వరలో విడుదల కానున్న ప్రభాస్ మూవీ “కల్కి 2898 AD”లో గెస్ట్ రోల్ చేసింది. మరో రెండు తెలుగు చిత్రాల్లో నటించేందుకు చర్చలు జరుపుతోంది.
హిందీలో ఆమెకి మంచి క్రేజు ఉంది. రెండు బాలీవుడ్ మూవీస్ నిర్మాణ దశలో ఉన్నాయి.