
రానురాను ఏది క్రేజ్, ఏది హైప్ అనేది తెలియట్లేదు. హీరో ఎదురుపడితే ఈలలు-గోలలు. అరుపులు-కేకలు. ఫ్లెక్సీలతో తోపులాటలు. సందు దొరికితే స్టేజ్ ఎక్కేసి హీరో కాళ్లపై పడిపోవడాలు. ఇలా కళ్ల ముందు కనిపించే సన్నివేశాల్లో నిజం ఎంత?
ఇలాంటి సన్నివేశాలన్నింటినీ ఇప్పుడు అనుమానించాల్సిన పరిస్థితి వస్తోంది. వీటితో పాటు సోషల్ మీడియాలో కనిపించే ట్రెండింగ్ లు, నంబర్లను కూడా ప్రశ్నార్థకంగా చూడాల్సి వస్తోంది. దీనికి కారణం కొంతమంది హీరోల సినిమాలు సాధిస్తున్న వసూళ్లు.
ఉదాహరణకు విశ్వక్ సేన్ నే తీసుకుందాం. ఇతడి సినిమా ఫంక్షన్లకు వచ్చే జనం చేసే హడావుడి అంతా ఇంతా కాదు. ఈయన మాటల కంటే, ఈయన అభిమానులమని చెప్పుకునే జనం అరుపులు ఎక్కువగా హైలెట్ అవుతుంటాయి.
విశ్వక్ కు ఇంత క్రేజ్ ఉందా అని ఆశ్చర్యపోయేలా ఉంటుంది ఆ హడావుడి. కట్ చేస్తే, అతడు నటించిన ‘లైలా’ సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్. విశ్వక్ కోసం గొంతు చించుకొని అరిచే ఆ బ్యాచ్ థియేటర్లకు వచ్చినా, ఈ సినిమాకు నామమాత్రపు వసూళ్లు వచ్చి ఉండేవేమో.
గతంలో విజయ్ దేవరకొండ విషయంలో కూడా ఇదే జరిగింది. అతడి క్రేజ్ ఆలిండియా లెవెల్ కు పాకిందని అంతా అనుకున్నారు. ‘లైగర్’ రిజల్ట్ చూసిన తర్వాత ఎవరి అనుమానాలు వాళ్లకు కలిగాయి. ‘ది ఫ్యామిలీ స్టార్’ రిలీజైన తర్వాత చాలామందికి క్లారిటీ వచ్చింది.
ఇప్పుడీ లిస్ట్ లో తాజాగా చేరిన వ్యక్తి సిద్ధు జొన్నలగడ్డ. ‘డీజే టిల్లూ’, ‘టిల్లూ స్క్వేర్’ సినిమాలతో సిద్ధుకు యూత్ లో బీభత్సమైన ఫాలోయింగ్ వచ్చిందన్నారు చాలామంది. మరి ఆ యూత్ అంతా ఏమైపోయింది.. ఎటెళ్లిపోయింది? ‘జాక్’ సినిమాకు ఓపెనింగ్స్ ఎందుకు రాలేదు?
సినిమా హిట్టయిందా ఫ్లాప్ అయిందా అనేది తర్వాత సంగతి. ఓ స్టార్ నటించిన సినిమా వస్తుందంటే ఓపెనింగ్స్ అదిరిపోవాలి. కానీ కొంతమంది హీరోలకు సోషల్ మీడియాలో కనిపిస్తున్నంత క్రేజ్.. ఓపెనింగ్స్ లో కనిపించడం లేదు. ఈ రెండింటికి మధ్యలో భారీ గ్యాప్ కనిపిస్తోంది. ఆ గ్యాప్ నే స్టార్ డమ్ అంటారేమో.