ఒకడు సాంబార్ అంటాడు.. మరొకడు జోకర్ అంటాడు
.ఓవైపు సౌత్ సినిమా దేశాలు దాటుకుంటే, కొంతమంది బాలీవుడ్ జనం మాత్రం ఇంకా భ్రమల్లోనే బతుకుతున్నారా? హిందీ సినిమాల్ని చూసి జనం బూతులు తిడుతుంటే, విమర్శకులు దుమ్మెత్తిపోస్తుంటే, వీళ్లు మాత్రం ఇంకా అదే చూరు పట్టుకొని వేలాడుతున్నారా? సౌత్ సినిమాల గొప్పదనాన్ని, సౌత్ హీరోల క్రేజ్ ను అంగీకరించడానికి ఇబ్బందిపడుతున్నారా..?
మొన్నటికిమొన్న షారూక్ ఖాన్, తాజాగా అర్షద్ వార్సి, మధ్యలో షాహిద్ కపూర్.. ఇలా కొంతమంది మధ్యమధ్యలో సౌత్ సినిమాలు, హీరోలపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. తెలుగు, తమిళ సినిమాలు నార్త్ లో కోట్లు కలెక్ట్ చేస్తుంటే బహుశా వీళ్లు తట్టుకోలేకపోతున్నారేమో..
ఆ మధ్య ఓ ఫంక్షన్ లో షారూక్ ఖాన్, రామ్ చరణ్ పై నోరు పారేసుకున్నాడు. స్టేజ్ పైకి పిలిచే క్రమంలో రామ్ చరణ్ ను ఇడ్లీసాంబార్ అని సంభోదించాడు. దానిపై అప్పట్లో చాలా పెద్ద రచ్చ నడిచింది. షాహిద్ కపూర్ అయితే మరో అడుగు ముందుకేసి, సౌత్ ప్రేక్షకులు హిందీ సినిమాల్ని ఆదరించరు…వాళ్ల సినిమాలు మాత్రం హిందీలో ఆడాలా అనే అర్థం వచ్చేలా మాట్లాడాడు.
ఇక తాజాగా అర్షద్ వార్సీ నోటిదురుసు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ను పట్టుకొని జోకర్ అనే పదం వాడాడు ఇతగాడు. బాలీవుడ్ లో ఏ స్టార్ హీరోను తీసుకున్నా, అతడికంటే ప్రభాస్ ఎక్కువే. ఇంకా చెప్పాలంటే బాలీవుడ్ లో కూడా నంబర్ వన్ హీరో ప్రభాసే. అతడి సినిమాల వసూళ్లు చెబుతాయి, ప్రభాస్ స్టామినా ఏంటో. ఇలాంటి హీరోను పట్టుకొని అర్షన్ నోరుపారేసుకున్నాడు. బహుశా, సౌత్ సినిమా, మరీ ముఖ్యంగా తెలుగు సినిమా ఎదుగుతుంటే ఇలాంటి కొంతమంది తట్టుకోలేకపోతున్నారేమో.