
ఈ మధ్య తెలుగు సినిమాల్లో డాన్సులు శృతిమించిన సంగతి తెలిసిందే. ‘మిస్టర్ బచ్చన్’ సినిమాలో హీరోయిన్ బొడ్డు లోపలకు చేయి దూర్చి మరీ స్టెప్పులేశాడు రవితేజ. ఇక ‘డాకు మహారాజ్’ లో దబిడి దిబిడి అంటూ బాలయ్య హీరోయిన్ బ్యాక్ మొత్తం వాయించేశాడు. ఇప్పుడు తాజాగా ‘రాబిన్ హుడ్’ లో కేతిక శర్మ తన లంగాని ముందుకు జరుపుతూ స్టెప్పులు వేసింది.
కింద వేసుకున్న లంగా లాంటి డ్రెస్ ను ముందుకు లాగుతూ ఆమె వేసిన హుక్ స్టెప్ పెద్ద దుమారమే రేపుతోంది. దీన్ని ఇమిటేట్ చేస్తూ కొంతమంది అమ్మాయిలు ఇనస్టాలో రీల్స్ చేస్తుంటే, జనం భరించలేకపోతున్నారు. మొత్తానికి ఈ ప్రహసనం మొత్తం తెలంగాణ మహిళా కమిషన్ చెంతకు చేరింది.
రోజురోజుకు తమ వద్ద పెరుగుతున్న ఫిర్యాదుల్ని చూసి మహిళా కమిషన్ కూడా కాస్త సీరియస్ అయింది. నేరుగా సినిమా పేర్లు ప్రస్తావించకుండా, చిన్నపాటి హెచ్చరిక జారీ చేసింది. దర్శకులు, నటీనటులు, కొరియోగ్రాఫర్లు కాస్త బాధ్యతగా వ్యవహరించాలని సూచించింది. ఇప్పటికే చాలామంది ఫిర్యాదులు చేస్తున్నారని చెబుతూనే, సినిమా కంటెంట్ లో మహిళల్ని కించపరిచేలా ఏమైనా అభ్యంతరం ఉంటే తమకు ఫిర్యాదు చేయమని ఈ సందర్భంగా మహిళా కమిషన్ పిలుపునిచ్చింది.
ప్రస్తుతానికైతే ఓపెన్ వార్నింగ్ తో సరిపెట్టిన కమిషన్, రాబోయే రోజుల్లో సీరియస్ గా యాక్షన్ లోకి దిగేలా ఉంది.
ఐతే, సినిమా పాటలు, ఆ స్టెప్పులు అసభ్యంగా ఉంటున్న మాట వాస్తవమే అయినా తెలంగాణ మహిళా కమీషన్ కి చర్యలు తీసుకునే అధికారం ఉంటుందా? సెన్సార్ బోర్డుకి మాత్రమే సన్నివేశాలకు అభ్యంతరం చెప్పే అధికారం ఉంది. దేశంలో ఉన్న ప్రతి కమీషన్లు చర్యలు తీసుకుంటే ఇక సెన్సార్ బోర్డు ఎందుకు?
తెలంగాణ కమీషన్ సూచన చెయ్యొచ్చు కానీ తెలుగు సినిమా నిర్మాతలు, దర్శకులపై చర్యలు తీసుకుంటే కోర్టులు ఊరుకుంటాయా అనేది చూడాలి.