ఇప్పటివరకు ఈ పోలిక ఎవ్వరూ తీసుకురాలేదు. బహుశా, చాలామందికి అలాంటి ఆలోచన కూడా వచ్చి ఉండదు. కానీ గేమ్ ఛేంజర్ ట్రయిలర్ చూసిన తర్వాత ఎంతోమందికి ఒకే ఒక్కడు సినిమా గుర్తొచ్చి ఉంటుంది. దర్శకుడు రాజమౌళి కూడా వీళ్లలో ఒకరు.
గేమ్ ఛేంజర్ ట్రయిలర్ రిలీజ్ చేసిన రాజమౌళి, శంకర్ తీసిన ఒకే ఒక్కడు సినిమాను గుర్తు చేసుకున్నారు. ఆ సినిమాలో ఓ షాట్ అంటే రాజమౌళికి చాలా ఇష్టమంట. ఓ కాళ్లు లేని ఓ దివ్యాంగులు హీరో దగ్గరకొచ్చి, అన్నా ఈ రాష్ట్రం కూడా నాలా కుంటిదైపోయింది, కాపాడు అని కోరే సీన్ రాజమౌళికి ఎంతో ఇష్టమంట.
ఆ సీన్ చూసినప్పుడల్లా తనకు కన్నీళ్లు వస్తాయని, మళ్లీ అలాంటి షాట్స్ ను గేమ్ ఛేంజర్ లో చూశానని అంటున్నారు రాజమౌళి.
ALSO READ: Game Changer trailer: A vibrant spectacle with political drama
దర్శకుడు శంకర్, హీరో రామ్ చరణ్ ను పొగిడే క్రమంలో రాజమౌళి ఈ వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు కానీ, చాలామందికి మాత్రం గేమ్ ఛేంజర్ ట్రయిలర్ చూసిన తర్వాత ఒకే ఒక్కడు సినిమానే గుర్తొచ్చింది.
ఒకే ఒక్కడు సినిమాలో హీరో ‘వన్ డే చీఫ్ మినిస్టర్’గా కనిపిస్తాడు. ఆ క్రమంలో ముఖ్యమంత్రికి, హీరోకు మధ్య ఘర్షణ. ఇక్కడ గేమ్ ఛేంజర్ లో కూడా అదే కనిపించింది. ముఖ్యమంత్రితో ఓ ఐఏఎస్ ఘర్షణ.
కాకపోతే, ఒకే ఒక్కడులో అర్జున్ లో షేడ్ ఒక్కటే. కానీ గేమ్ ఛేంజర్ లో మాత్రం రామ్ చరణ్ 2-3 షేడ్స్ లో కనిపిస్తున్నాడు. బలమైన ఫ్లాష్ బ్యాక్ కూడా ఉన్నట్టు ట్రయిలర్ చూస్తే తెలుస్తోంది. ప్రస్తుతానికైతే సోషల్ మీడియా మొత్తం గేమ్ ఛేంజర్ ను ఒకే ఒక్కడుతో పోల్చడం మొదలుపెట్టింది. ఇక ఫైట్స్, సాంగ్స్ కంపేర్ చేయడం సరేసరి.
అర్జున్ సినిమా కథకు, గేమ్ ఛేంజర్ కు సంబంధం ఉండకపోవచ్చు కానీ ట్రయిలర్ రిలీజైన తర్వాత మాత్రం ఈ రెండు సినిమాలకు మధ్య సారూప్యత కనిపిస్తోంది. ఓ పెద్ద సినిమాకు, మరో కల్ట్ మూవీతో పోలిక మంచిదే.