సత్యదేవ్ విలక్షణ నటుడు. ఫ్రెండ్ పాత్రలతో కెరీర్ మొదలుపెట్టి హీరోగా కెరీర్ స్థిరపరచుకున్నాడు. బాలీవుడ్ లో కూడా నటించాడు. ఐతే ఇటీవల కాలంలో సరైన హిట్ పడలేదు. అయినా హీరోగా పలు సినిమాలు ఉన్నాయి. 2025లో రెండు సినిమాలు విడుదల కానున్నాయి.
ఇప్పుడు హీరోగా నటిస్తున్నా… అడపాదడపా పెద్ద సినిమాల్లో కీలక పాత్రలు చేస్తున్నాడు. విజయ్ దేవరకొండ సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపిస్తాడు. అలాగే ఆ మధ్య విలన్ గా కూడా నటించాడు. చిరంజీవి “గాడ్ ఫాదర్” సినిమాలో విలన్ గా చేశాడు. మరి ఆ సినిమా తర్వాత మళ్లీ ఎందుకు విలన్ గా కనిపించలేదు? అతడికి నెగెటివ్ షేడ్ క్యారెక్టర్స్ రావట్లేదా?
“విలన్ పాత్రలు వస్తూనే ఉన్నాయి. కాకపోతే నా సినిమాలు నాకున్నాయి. ఇంకొన్ని సినిమాలున్నాయి. మధ్యలో ఎక్కడైనా ఏదైనా విలన్ రోల్ సూపర్ ఇంట్రెస్ట్ అనిపించినప్పుడు తప్పకుండా చేస్తాను. అయితే నా తొలి ప్రాధాన్యం హీరో పాత్రలకే. ఎందుకంటే, ఇవి ఉంటేనే కదా, ఏ పాత్రలైనా వస్తాయి.”
తనకు ఇప్పటికీ ఇప్పటికీ విలన్ పాత్రలొస్తున్నాయని తెలిపిన సత్యదేవ్… ఏది చేయాలి, ఏది చేయకూడదనేది తన ఛాయిస్ అన్నాడు. తనకు సరైన టైమ్ లో, కరెక్ట్ అనిపించినప్పుడు అది విలన్ పాత్ర అయినప్పటికీ తప్పకుండా చేస్తానంటున్నాడు.