
సాధారణంగా యంగ్ హీరోయిన్లు ఎవరూ పిల్ల తల్లి పాత్రలు పోషించేందుకు ఇష్టపడరు. సగటు గృహిణిగా కనిపించేందుకు ససేమిరా అంటారు. కానీ నివేథా థామస్ ఆ పాత్రలకు సై అంటోంది.
నివేథా థామస్ వయసు కేవలం 28 ఏళ్లే. 30 కూడా దాటకముందే ఆమె గృహిణి రోల్స్ పోషిస్తోంది. “35 – చిన్న కథ కాదు” సినిమాలో ఆమెది ఇదే పాత్ర. ఈ సినిమా టీజర్ చూస్తేనే అర్థమవుతోంది ఆమె మెల్లగా “ఆంటీ రోల్స్” వైపు వెళ్తోందని.
నివేథా థామస్ మొదటినుంచి కొంత భిన్నంగా తన కెరీర్ ని ప్లాన్ చేసుకొంది. మొదట్లో టకా టకా సినిమాలు ఒప్పుకొంది. నాని, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, రజినీకాంత్, కళ్యాణ్ రామ్… ఇలా పలువురు స్టార్స్ సినిమాల్లో నటించిన ఈ భామ ఇటీవల కాన్సెప్ట్ సినిమాలు, చిన్న చిత్రాలు మాత్రమే చేస్తోంది. అందులోనూ తన పాత్ర చుట్టూ తిరిగే కథలే ఒప్పుకుంటోంది.
ఐతే, మరీ పిల్ల తల్లి రోల్స్ అప్పుడే ఒప్పుకోవడం అంటే డేరింగ్ అనే చెప్పాలి. ఇకపై ఆమెకి అన్ని ఇలాంటి పాత్రలే రావొచ్చు.