
తెలుగు నుంచి అనేక చిత్రాలు 1000 కోట్లు కొల్లగొట్టినవి ఉన్నాయి. బాహుబలి 2, ఆర్ ఆర్ ఆర్, పుష్ప 2, కల్కి 2898 AD… ఇలా లిస్ట్ చాలా ఉంది. అనేక తెలుగు చిత్రాలు 1000 కోట్లుపైనే పొందాయి.
కానీ ఇప్పటివరకు ఒక్క తమిళ చిత్రం అంత కలెక్షన్లు పొందలేదు. ఆఖరికి కన్నడ సినిమాకి కూడా ఆ రికార్డులు ఉన్నాయి. కానీ రజినీకాంత్, కమల్ హాసన్, శంకర్, మణిరత్నం వంటి వారున్న తమిళ చిత్రసీమ 1000 కోట్ల వసూళ్లు పొందిన సినిమా తీయలేదు. తెలుగు సినిమాలకు అమెరికా, ఆస్ట్రేలియా, గల్ఫ్ వంటి కొన్ని దేశాల్లోనే ఓవర్సీస్ మార్కెట్ ఉంది. తమిళ చిత్రాలకు మాత్రం బాలీవుడ్ తర్వాత అతిపెద్ద మార్కెట్ ఉంది. సింగపూర్, మలేసియా, బ్రిటన్, యూరోప్ వంటి భారీ మార్కెట్ ఉన్న ఇండస్ట్రీ తమిళ చిత్రసీమ.
మరి ఎందుకు తమిళ సినిమా పరిశ్రమ 1000 కోట్ల సినిమా డెలివరీ చేయలేకపోతోంది.
“థగ్ లైఫ్” చిత్రం ప్రొమోషన్ లలో మణిరత్నంకి ఇదే ప్రశ్న ఎదురైంది. దానికి ఆయన ఇచ్చిన సమాధానం ఏంటంటే…
“ఒకప్పుడు సినిమా కంటెంట్ ఏంటి? ఎంత మందికి నచ్చింది అనే ఆలోచించేవారు. ఇప్పుడు, సోషల్ మీడియా ప్రతి సినిమాని అది ఎంత వసూల్ చేసింది అనే కోణంలోనే చూస్తున్నారు. బాక్సాఫీస్ నంబర్ల గురించి మాత్రం ఆలోచన ఉంటుంది. సినిమా బాగుందా? గొప్పగా తీశారా లేదా అన్న థాట్ ఎవరికీ రావడం లేదు. ఇలా ఐతే గొప్ప సినిమాలు ఎలా వస్తాయి. 1000 కోట్ల సినిమా కన్నా మంచి సినిమా తీయడమే ప్రాధాన్యంగా ఉండాలి.”