
కొన్ని రోజులుగా తనపై జరుగుతున్న ప్రచారాన్ని, ట్రోలింగ్ ను ఎట్టకేలకు తిప్పికొట్టింది సింగర్ మంగ్లీ. తను పాటను నమ్ముకున్నాను కానీ, పార్టీలను కాదని స్పష్టం చేసింది. తనపై ట్రోలింగ్ చేస్తున్న అందరికీ క్లారిటీ ఇచ్చేందుకు బహిరంగ లేఖ విడుదల చేసింది.
ఇంతకీ ఏం జరిగిందంటే.. శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో జరిగిన రథసప్తమి వేడుకల్లో మంగ్లీ పాల్గొంది. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తన కుటుంబ సభ్యులతో పాటు మంగ్లీని స్వయంగా ఆలయంలోకి తీసుకెళ్లి స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు.
దీనిపై టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. వైసీపీ ప్రచారం కోసం పాటలు పాడిన సింగర్ ను, టీడీపీ ఎంపీ ఎలా ప్రోత్సహిస్తారంటూ పోస్టులు పడ్డాయి. అదే టైమ్ లో మంగ్లీపై కూడా ఓ రేంజ్ లో ట్రోల్ నడిచింది. దీనిపై మంగ్లీ క్లారిటీ ఇచ్చింది.
“2019 ఎన్నికలకు ముందు వైఎస్సార్సీపీకి చెందిన కొందరు నాయకులు నన్ను సంప్రదిస్తే పాట పాడా. నేను ఇతర పార్టీలకు సంబంధించిన ఎవరినీ ఒక్క మాట అనలేదు. వైకాపా ఒక్కటే కాదు, అన్ని పార్టీల లీడర్లకు నేను పాటలు పాడా. 2024 ఎన్నికల్లో ఏ పార్టీకీ నేను పాటలు పాడలేదు.”
రథసప్తమి వేడుకల్లో పాటలు పాడేందుకు తనను ఆహ్వానించారని, ఓ కళాకారిణిగా తనను గుర్తించి, మంత్రితో పాటు దర్శనం కల్పించారని, దేవుడి కార్యక్రమానికి రాజకీయ ముద్ర వేయొద్దని కోరింది మంగ్లీ.