
బాలకృష్ణ, దర్శకుడు క్రిష్ మరోసారి కలవబోతున్నారు. ఇప్పటికే 3 సినిమాలు చేసిన ఈ కాంబినేషన్ లో ఇప్పుడు నాలుగో సినిమా రాబోతోంది. అది కూడా ప్రతిష్టాత్మక సీక్వెల్ కావడం విశేషం.
‘ఆదిత్య 369’ కు సీక్వెల్ చేయాలనే కోరిక బాలయ్యకు ఎప్పట్నుంచో ఉంది. సీక్వెల్ కోసం కథ తనే రాశానని, రాత్రికి రాత్రి సింగిల్ సిట్టింగ్ లో కథ రెడీ అయిపోయిందని ఆయన గతంలో పలుమార్లు చెప్పుకొచ్చారు. ఒక దశలో సినిమాను తనే డైరక్ట్ చేస్తానని కూడా తనకుతానుగా ప్రకటించుకున్నారు.
కానీ దర్శకత్వ బాధ్యతల నుంచి బాలయ్య తప్పుకున్నట్టు తెలుస్తోంది. ఈ సీక్వెల్ ను క్రిష్ చేతిలో పెట్టినట్టు సమాచారం.
బాహుబలి లాంటి సినిమాను తీసిన ఆర్కా మీడియా ‘ఆదిత్య 999’ సినిమాను తెరపైకి తీసుకొస్తుంది. అయితే ఈ సినిమా సెట్స్ పైకి రావడానికి టైమ్ పట్టేలా ఉంది.

గోపీచంద్ మలినేని సినిమా స్టార్ట్ చేయబోతున్నారు బాలయ్య. ఆ సినిమా పూర్తయితే తప్ప ఈ సీక్వెల్ రాదు. మరోవైపు క్రిష్ కూడా ‘ఘాటీ’ పనుల్లో ఉన్నారు. ఇంతకుముందు వీళ్లిద్దరి కాంబినేషన్ లో గౌతమీపుత్ర శాతకర్ణి, ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాలొచ్చాయి.