
రష్మిక మందాన కర్ణాటక మంత్రులు, శాసనసభ్యులు చేసిన ఆరోపణల నేపథ్యంలో ఆమెకి మద్దతుగా నిల్చింది హీరోయిన్, బీజేపీ ఎంపీ కంగన రనౌత్. కర్ణాటకకు చెందిన రష్మిక ఇప్పుడు తెలుగు, బాలీవుడ్ లో పెద్ద హీరోయిన్ గా ఎదిగింది. అందుకే, ఆమె కర్ణాటకని, కన్నడ సంస్కృతిని పట్టించుకోవడం లేదని అక్కడి కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.
ఇటీవల తమ ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమానికి పిలిస్తే రష్మిక అస్సలు ఖాతరు చెయ్యలేదని ఏకంగా కర్ణాటక ఉప ముఖ్యమంత్రి విమర్శించారు. దాంతో, కర్ణాటక బీజేపీ రష్మికకు మద్దతు ఇస్తోంది. ఇప్పుడు కంగన కూడా తన సపోర్ట్ తెలిపింది.
“కొందరు ఇరుకున పెట్టాలని ప్రయత్నిస్తారు. మరికొందరు స్క్రూలు బిగించడానికి చూస్తారు. కానీ దేవుడు మనల్ని రక్షిస్తాడు. దేవుడు ఎల్లప్పుడూ కళాకారులందరికీ తోడుగా ఉంటాడు,” అని ఆమె పేర్కొంది.
తాను హైదరాబాద్ లో స్థిరపడినప్పటికీ తన మూలాలు మరిచిపోనని అంటోంది రష్మిక. రాజకీయ ఈవెంట్స్ కి అటెండ్ కావొద్దనేది ఆమె పాలసీ. ఏ పార్టీకి మద్దతుదారుగా ఉండేందుకు ఆమె ఆసక్తి చూపడం లేదు. కేవలం సాంస్కృతిక, రాజకీయేతర కార్యక్రమాలకు మాత్రమే వెళ్తాను అని చెప్తోంది రష్మిక.