ప్రభాస్ హీరోగా రూపొందిన “కల్కి 2898 AD” విడుదలకి సిద్ధంగా ఉంది. ఈ సినిమాకి దర్శకుడు నాగ్ అశ్విన్. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’, ‘మహానటి’ సినిమాలతో ఎంతో పేరు తెచ్చుకున్న నాగ్ అశ్విన్ కెరీర్ లో ఇది అతి పెద్ద చిత్రం.
ఈ సినిమా ట్రైలర్ విడుదలయ్యాక చాలా మంది నుంచి వచ్చిన కామెంట్.. అనేక హాలీవుడ్ చిత్రాలను గుర్తు చేస్తోంది. వాటికి సమాధానం ఇచ్చారు ఈ దర్శకుడు. అనేక పురాణాలు చదివిన తర్వాత హాలీవుడ్ చిత్రాల తరహాలో మన పురాణ గాథలను సైన్స్ ఫిక్షన్ కథల్లా మలచొచ్చు అని భావించాడట నాగ్ అశ్విన్. అలా మొదలైంది ఈ కథ…
ఈ సినిమా గురించి… ఈ సినిమాకి స్ఫూర్తి గురించి ఆయన మాటల్లోనే.
నాగ్ అశ్విన్
“చిన్నప్పటి నుంచి నాకు పౌరాణిక చిత్రాలంటే చాలా ఇష్టం. ‘పాతాళభైరవి’, ‘భైరవ ద్వీపం’, ‘ఆదిత్య 369’ నాకు ఇష్టమైన సినిమాలు. హాలీవుడ్ ‘స్టార్ వార్స్’ లాంటి సినిమా చూసినప్పుడు చాలా బావున్నాయనిపించాయి. కానీ అలాంటివి ఎప్పుడూ వెస్ట్ లోనే జరగాలా? మన కథలు వద్దా అనిపించేది. మహాభారతంలో ఎన్నో గొప్ప పాత్రలున్నాయి. కృష్ణవతారంతో మహాభారతం పూర్తి అవుతుంది.
అక్కడి నుంచి కలియుగంకు ఎంటరైనప్పుడు ఈ కథ ఎలా వెళుతుందనేది పూర్తిగా నా ఊహలో నుంచి పుట్టిన ఆలోచన. ఆ ఆలోచనను కథగా రాయలనుకున్నా. మనం చదివిన పురాణాలు అన్నిటికీ ఒక క్లైమాక్స్ లా ఉంటుంది ఈ కథ.
ప్రతి యుగంలో కలిపురుషుడిలా ప్రవర్తించేవారు ఉన్నారు. ఒక యుగంలో రావణుడు, మరో యుగంలో దుర్యోధనుడు… ఇలా అన్నిట్లో ఒక రూపం తీసుకొని కలియుగంలో ఒక అల్టిమేట్ ఫైనల్ రూపం తీసుకుంటే అతనితో పోరాటం ఎలా వుంటుందనే ఐడియాతో రాసుకున్న కథ ఇది. రాయడానికి 5 సంవత్సరాలు పట్టింది.”