సందీప్ కిషన్ చేతుల మీదుగా మరో దర్శకుడు పరిచయం కాబోతున్నాడు. ఈసారి పరిచయమౌతున్న వ్యక్తి అలాంటిలాంటోడు కాదు. తమిళ సూపర్ స్టార్ విజయ్ కొడుకు. అవును.. దళపతి విజయ్ కొడుకు జాసన్ సంజయ్ ను దర్శకుడిగా పరిచయం చేస్తున్నాడు సందీప్ కిషన్.
ఈ విషయంలో సందీప్ కిషన్ ది లక్కీ హ్యాండ్ అంటారు చాలామంది. ఎందుకంటే, ప్రస్తుతం టాప్ లో ఉన్న లోకేష్ కనగరాజ్ ను దర్శకుడిగా పరిచయం చేసింది ఇతగాడే. ఇప్పుడు విజయ్ కొడుకు జాసన్ సంజయ్ ను కూడా దర్శకుడిగా పరిచయం చేస్తున్నాడు.
జాసన్ సంజయ్ దర్శకుడిగా మారిన సంగతి పాత విషయమే. లైకా ప్రొడక్షన్స్ అతడికి చెక్ అందజేసే ఫోటోను విడుదల చేసి మరీ సినిమా ఎనౌన్స్ చేసింది. ఇప్పుడీ ప్రాజెక్టులోకి హీరోగా సందీప్ కిషన్ వచ్చి చేరాడు.
విజయ్ నటవారసుడిగా హీరో అవ్వాలనుకోలేదు జాసన్ సంజయ్. అతడికి దర్శకత్వం అంటే ఇష్టం. కథలు రాయడం అంటే ఇంకా ఇష్టం. అందుకే టొరంటో ఫిలింస్కూల్ లో మూవీ ప్రొడక్షన్ లో డిప్లమా చేశాడు. ఆ తర్వాత లండన్, కెనడాల్లో స్క్రీన్ రైటింగ్ లో ట్రయినింగ్ తీసుకున్నాడు. ఇప్పుడు తండ్రి అండ లేకుండా దర్శకుడిగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నాడు.