ఈమధ్య 150 కోట్లు పెట్టి చెన్నై పోయెస్ గార్డెన్ లో పెద్ద బంగ్లా కొనుక్కున్నాడు ధనుష్. దీనికి సంబంధించి అతడిపై భారీ ఎత్తున ట్రోలింగ్ నడిచింది. ఒక్కొక్కరు ఒక్కో విధంగా ట్రోలింగ్ చేశారు. ఇలాంటి ట్రోల్స్ పై నేరుగా స్పందిస్తుంటాడు ధనుష్. ఈసారి కూడా అదే పని చేశాడు.
16 ఏళ్ల వయసులో రజనీకాంత్ ను చూసేందుకు పోయెస్ గార్డెన్ కు వెళ్లేవాడట. అక్కడ రజనీకాంత్ కనిపించకపోయినా, ఆయన ఇల్లు చూసి సంతృప్తి చెంది వచ్చేసేవాడంట. అదే ప్రాంతంలో అల్లంత దూరంలో జయలలిత ఇల్లు కూడా ఉండేది. అక్కడ కూడా జనం విపరీతంగా ఉండేవారు.
ఈ రెండు ఇల్లు చూసిన తర్వాత 16 ఏళ్ల వయసులో ధనుష్ కు ఓ కోరిక కలిగిందంట. ఎలాగైనా ఈ 2 ఇళ్లకు దగ్గర్లో తను కూడా ఓ ఇల్లు కొనుక్కోవాలని అప్పుడే నిర్ణయించుకున్నాడట.
సినిమాల్లోకి వచ్చిన 20 ఏళ్ల తర్వాత తన కోరికను నెరవేర్చుకున్నట్టు తెలిపాడు ధనుష్. కలలు కనాలని, వాటిని సాధించేందుకు కష్టపడాలని, తను కూడా అదే చేశానని ట్రోల్స్ కు దీటైన జవాబు ఇచ్చాడు.