మెగాస్టార్ చిరంజీవి తాను రాజకీయాలకు దూరం అని చెప్పారు. ఇటీవల తన తమ్ముడు పవన్ కళ్యాణ్ వచ్చి కలిసినప్పుడు కూడా జనసేనకి ఓటెయ్యమని చెప్పలేదు. తన మద్దతు పవన్ కళ్యాణ్ కి ఉంటుందని మాత్రమే అన్నారు. అలాగే తన సోదరుడి పార్టీకి 5 కోట్ల విరాళం అందచేశారు.
ఐతే, ఆ తర్వాత బీజేపీ తరఫున పోటీ చేస్తున్న సీఎం రమేష్ కి ఓటేయాలని ప్రజలను కోరుతూ చిరంజీవి ప్రత్యేకంగా వీడియో సందేశం పంపారు. జనసేన – బీజేపీ – తెలుగు దేశం పార్టీ కూటమిని గెలిపించాలని కోరారు. దాంతో, మెగాస్టార్ చిరంజీవి ఒక అడుగు వేసినట్లు అయింది. ఇక బయటికి వచ్చి ప్రచారం చెయ్యడమే మిగిలి ఉంది.
తాజాగా చిరంజీవి ఆ పని కూడా చెయ్యబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
మే మొదటివారంలో చిరంజీవి గోదావరి జిల్లాలలో ప్రచారం చేస్తారని జనసేన అభిమానులు సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్నారు. శనివారం నాడు వరుణ్ తేజ్ జనసేన తరఫున పిఠాపురంలో ప్రచారం చేస్తున్నారు. చిరంజీవి కూడా ఆ పని చేస్తారని జనసేన అభిమానుల మాట.
మెగాస్టార్ చిరంజీవి తాను రాజకీయాలకు దూరం అని చెప్పి ఇలా డైరెక్ట్ గా రంగంలోకి దిగితే సంచలనమే అవుతుంది. గోదావరి జిల్లాల్లో కూటమికి మరింత బలం వస్తుంది. మరి మెగాస్టార్ నిజంగా ఆ ధైర్యం చేస్తారా అనేది చూడాలి.
రాజకీయ రంగు పడుతుందా!
గతంలో మెగాస్టార్ చిరంజీవి “ప్రజారాజ్యం” అనే పార్టీ స్థాపించారు. 18 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఆయన కేంద్రమంత్రిగా పనిచేశారు. కానీ తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి మళ్ళీ సినిమాలవైపు వచ్చి అందరివాడుగా ఉంటున్నారు. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, వైకాపా… ఇలా అన్ని పార్టీలతో సత్సంబంధాలు కలిగి ఉన్న చిరంజీవి ఇటీవలే పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్నారు. ఇలాంటి సమయంలో ఆయన తన తమ్ముడి కోసం ప్రచారం చేసినా రాజకీయ రంగు అంటుకుంటుంది.