
సెప్టెంబర్ 25.. ‘అఖండ 2’ రిలీజ్. ఈ విషయాన్ని మేకర్స్ చాన్నాళ్ల కిందటే ప్రకటించారు. అయితే అదే తేదీకి ‘ఓజీ’ విడుదల కూడా ఉండడంతో, ‘అఖండ 2’పై అనుమానాలు పెరిగాయి. తాజాగా మరోసారి పుకార్లు వ్యాపించాయి. పవన్ సినిమా వస్తోందని, బాలకృష్ణ సినిమా వచ్చే అవకాశం లేదంటూ కథనాలొచ్చాయి.
వీటిపై తాజాగా యూనిట్ స్పందించింది. ‘అఖండ 2’ను చెప్పిన టైమ్ కే విడుదల చేస్తామని మరోసారి ప్రకటించింది యూనిట్. గ్రాఫిక్ వర్క్ లేట్ అవుతోందనే ప్రచారంలో నిజం లేదని ఖండించిన యూనిట్.. ప్రస్తుతం డబ్బింగ్ వర్క్ నడుస్తోందని, ఆగస్ట్ 15కే ఫస్ట్ కాపీ రెడీ అయిపోతుందని తెలిపారు.
అన్నీ అనుకున్నట్టు జరిగితే సెప్టెంబర్ 1కే ఓవర్సీస్ కాపీ రెడీ చేసి పంపించేస్తాంటోంది యూనిట్. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 25కి రావడం పక్కా అని తేలిపోయింది.
రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలకృష్ణ మరోసారి అఘోరాగా కనిపించబోతున్నారు. ఈ సారి సినిమా మొత్తం అఘోర పాత్ర చుట్టూనే తిరగబోతోంది. తమన్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.















