
పవన్ చేసే ప్రతి సినిమా వెనక త్రివిక్రమ్ ఉంటారు. పవన్ ఓవైపు రాజకీయాలతో బిజీగా ఉంటే ఆయనకు సినిమాలు సెట్ చేసి పెట్టింది త్రివిక్రమే. అయితే ‘హరిహర వీరమల్లు’ విషయంలో మాత్రం త్రివిక్రమ్ పేరు పెద్దగా వినిపించలేదు. ఇన్నాళ్లకు ఈ ప్రాజెక్టుపైకి కూడా త్రివిక్రమ్ వచ్చారు.
‘హరిహర వీరమల్లు’ సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. సరిగ్గా ఇక్కడే త్రివిక్రమ్ ఎంటరయ్యారు. పవన్ ఆదేశాల మేరకు ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో త్రివిక్రమ్ చొరవ తీసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా ట్రయిలర్, సెకెండాఫ్ ఎడిటింగ్ వంటి విషయాల్లో త్రివిక్రమ్ కీలక పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తోంది.
దర్శకుడు క్రిష్, త్రివిక్రమ్ మధ్య అభిప్రాయబేధాలొచ్చినట్టు గతంలో వార్తలొచ్చాయి. ‘హరిహర వీరమల్లు’ సినిమాను కాదని, ‘ఓజీ’ లాంటి సినిమాల్ని త్రివిక్రమ్ సెట్ చేసినట్టు కథనాలొచ్చాయి. అందుకే ‘హరిహర..’కు త్రివిక్రమ్ దూరంగా ఉంటున్నారంటూ ఊహాగానాలు వినిపించాయి.
ఇప్పుడు ‘హరిహర వీరమల్లు’తో క్రిష్ కు సంబంధం లేదు. ఆయన ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు. దీంతో త్రివిక్రమ్ రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది.