
సంథ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్, దాదాపు 5 నెలలుగా కిమ్స్ లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడా బాలుడ్ని డిశ్చార్జ్ చేశారు. అయితే అతడు నేరుగా ఇంటికెళ్లడం లేదు. బాబును రీహాబిలిటేషన్ సెంటర్ కు తరలించబోతున్నారు.
గాయపడినప్పట్నుంచి కిమ్స్ లోనే చికిత్స పొందుతున్నాడు శ్రీతేజ. రీసెంట్ గా అతడికి కృత్రిమ శ్వాస అందించడం నిలిపేశారు. తనకుతానుగా శ్వాస తీసుకుంటున్నాడు. పైగా వైద్యులు చేస్తున్న ఫిజియోథెరపీకి కూడా స్పందిస్తున్నాడు.
కాబట్టి అతడ్ని రీహాబిలిటేషన్ సెంటర్ కు తరలించి రోబోటిక్ ఫిజియోథెరపీ అందిస్తే త్వరగా కోలుకునే అవకాశం ఉందని వైద్యులు భావిస్తున్నారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు.
తనకుతానుగా శ్వాస తీసుకుంటున్న శ్రీతేజ్, ఇంకా కుటుంబ సభ్యుల్ని గుర్తుపట్టడం లేదు. పైగా ఆహారం కూడా తీసుకోలేకపోతున్నాడు. పైప్ ద్వారానే అతడికి ఆహారం అందిస్తున్నారు. ఫిజియోథెరపీ తర్వాత పరిస్థితిలో మార్పు వస్తుందని భావిస్తున్నారు.
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందిన సంగతి తెలిసిందే. తన కొడుకును రక్షించే క్రమంలో ఆమె మరణించింది. ఆ ఘటనలో ఆక్సిజన్ అందక శ్రీతేజ్ మెదడు భాగం దెబ్బతింది. అతడు కోలుకోవడానికి మరికొన్ని నెలల సమయం పట్టొచ్చని చెబుతున్నారు వైద్యులు.