నభా నటేష్ సినిమాల్లో కన్నా ఇన్ స్టాగ్రామ్ లో ఎక్కువ హడావుడి చేస్తూ ఉంటుంది. ఎప్పుడూ ఎదో ఒక ఫోటోషూట్ చేస్తూ వాటిని ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేస్తూ వార్తల్లో నిలుస్తోంది. కానీ సినిమాల్లో ఆఫర్లు లేకపోయినా, సక్సెస్ లేకపోయినా క్రేజ్ ఉండదు. అందుకే ఈ భామ మళ్ళీ తెలుగు సినిమాల్లో సక్సెస్ కోసం ప్రయత్నాలు చేస్తోంది.
ప్రస్తుతం ఈ భామ “డార్లింగ్” సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. ఆమె తెలుగులో మూడు సినిమాల్లో నటిస్తుండగా, ముందుగా విడుదల అవుతున్న చిత్రం ఇదే. ఈ సినిమాలో ఆమె ప్రియదర్శి సరసన నటిస్తోంది.
ఇక నిఖిల్ సిద్ధార్థ్ సరసన “స్వయంభు” అనే భారీ చిత్రంలో రెండో హీరోయిన్ గానూ కనిపించనుంది. అలాగే “టైసన్ నాయుడు” అనే చిత్రంలో బెల్లంకొండ శ్రీనివాస్ కి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూడు సినిమాలతో తన దశ తిరుగుతుంది అని భావిస్తోంది. అందుకోసం ఎక్కువ కష్టపడుతోంది. ఈ మూడింటిలో రెండు ఈ ఏడాదే వస్తాయి.
ఆమె తెలుగులో ఇప్పటివరకు “ఇస్మార్ట్ శంకర్”, “సోలో బ్రతుకు సో బెటరు”, “డిస్కో రాజా”, “అల్లుడు అదుర్స్”, “మేస్ట్రో” వంటి పలు సినిమాల్లో నటించింది.