గత మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్, హీరో మంచు విష్ణు మధ్య మాటల యుద్ధం గురించి అందరికీ తెలిసిందే. డైలీ సీరియల్ టైపులో వారాల పాటు ఇద్దరూ మాటలతో గొడవపడ్డారు. ఒకానొక దశలో హద్దులు దాటి విమర్శలు చేసుకున్నారు.
ప్రకాష్ రాజ్ స్థానికతను మంచు విష్ణు లేవనెత్తగా.. మంచు విష్ణు సినిమాల రికార్డులు, కలెక్షన్లను ప్రకాష్ రాజ్ తక్కువచేసి మాట్లాడారు. ఇప్పుడీ ఇద్దరు మరోసారి మాటల యుద్ధానికి తెరదీశారు.
తిరుమల శ్రీవారి ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపారనే వివాదం నేపథ్యంలో ప్రకాష్ రాజ్ స్పందించారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యల్ని వ్యతిరేకిస్తూ మాట్లాడారు. ఈ విషయాన్ని జాతీయ ఇష్యూ చేయొద్దని, మరిన్ని మత ఘర్షణలు జరిగేలా వ్యవహరించొద్దని కోరారు.
దీనిపై మంచు విష్ణు ఘాటుగా స్పందించాడు. హద్దుల్లో ఉంటే మంచిదని ప్రకాష్ రాజ్ కు సూచించాడు. వివాదంపై పవన్ కల్యాణ్ ఆల్రెడీ సమగ్ర విచారణ కోరారని, మీరు ఈ అంశానికి మతం రంగు పులమొద్దని ఘాటుగా రియాక్ట్ అయ్యాడు. ఆ వెంటనే ప్రకాష్ రాజ్ కూడా స్పందించారు. విషయాన్ని తేలికపరుస్తూ, ఎవరి అభిప్రాయం వాళ్లది అనే అర్థం వచ్చేలా ట్వీట్ పెట్టారు. ఇలా ప్రకాష్ రాజ్, మంచు విష్ణు మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది.