కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించే క్రమంలో ‘దిల్ రాజు డ్రీమ్స్’ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు లాంచ్ చేశారు. ఈ మేరకు సోమవారం నాడు దిల్ రాజు టీం లోగోను లాంచ్ చేశారు. త్వరలోనే వెబ్ సైట్‌ను కూడా లాంచ్ చేయబోతోన్నారు.
ఒకటి కాదు, రెండు కాదు.. దిల్ రాజు చుట్టూ కనీసం అరడజను సినిమాలు నడుస్తుంటాయి. భారీ బడ్జెట్ సినిమాల నుంచి కాన్సెప్ట్ మూవీస్ వరకు అన్నీ ఈయన చేతిలో ఉంటాయి. మరి ప్రస్తుతం దిల్ రాజు చేతిలో ఉన్న సినిమాలేంటి? వాటి షూటింగ్ అప్ డేట్స్ ఏంటి? వీటిలో 2025లో వచ్చే సినిమాలెన్ని? వీటన్నింటిపై స్వయంగా దిల్ రాజు క్లారిటీ ఇచ్చాడు.
“‘గేమ్ ఛేంజర్’ జనవరి 10కి వస్తోంది. వెంకీ-అనీల్ రావిపూడి ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా కూడా సంక్రాంతికి రిలీజ్. నితిన్ ‘తమ్ముడు’ శివరాత్రికి రిలీజ్. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై యష్ మాస్టర్ ను హీరోగా పరిచయం చేస్తూ కొత్త దర్శకుడితో సినిమా చేస్తున్నాం. చూసుకుంటూ, చేసుకుంటూ రెడీ చేస్తున్నాం. ఫైనల్ షెడ్యూల్ పూర్తయింది. ఆశిష్ తో ‘సెల్ఫిష్’ చేస్తున్నాం. 50 శాతం షూటింగ్ అయింది. ‘పుష్ప-2’తో బిజీగా ఉన్న సుకుమార్, హోల్డ్ చేయమన్నాడు కాబట్టి ఆశిష్ మూవీని హోల్డ్ లో పెట్టాం. ‘పుష్ప-2’ రిలీజ్ తర్వాత సుకుమార్ ఈ ప్రాజెక్టుపై దృష్టి పెడతాడు. ఈ సినిమాలన్నింటినీ 2025లో విడుదల చేస్తాం. అలాగే నితిన్, బలగం వేణుతో ‘ఎల్లమ్మ’ ప్రాజెక్టు ఫైనల్ చేశాం. 2025 ప్రారంభంలో మొదలుపెట్టి, దసరాకు విడుదల చేస్తాం.”
ఇలా కొత్త ఏడాదికి సంబంధించి తన క్యాలెండర్ మొత్తం బయటపెట్టాడు దిల్ రాజు. ఈ లిస్ట్ లో విజయ్ దేవరకొండ, రవికిరణ్ కోలా సినిమా కూడా ఉంది. కాకపోతే ఆ సినిమాను 2026లో విడుదల చేయబోతున్నట్టు ప్రకటించాడు.
“కొత్త వాళ్లను, కొత్త కంటెంట్‌ను ఎంకరేజ్ చేసేందుకు ఈ దిల్ రాజు డ్రీమ్స్‌ను ప్రారంభించాను. దర్శక, నిర్మాతలు, హీరో హీరోయిన్లు ఇలా ఎవ్వరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్లు, కంటెంట్ ఉన్న వాళ్లు దిల్ రాజు టీంను అప్రోచ్ అవ్వొచ్చు. ఈ మేరకు ఓ వెబ్ సైట్‌ను లాంచ్ చేయబోతోన్నాం. ఆ వెబ్ సైట్ ద్వారా మీ కంటెంట్ మా టీంకు చేరుతుంది. వారంలో ఒక రోజు నేను ఈ టీం తెచ్చిన స్క్రిప్ట్‌లను వింటాను. నా బర్త్ డే సందర్భంగా అయినా లేదా న్యూయర్ సందర్భంగా అయినా ఈ కొత్త వెబ్ సైట్‌ను లాంచ్ చేస్తాం. నాకు సన్నిహితులైన స్టార్ హీరోలను, దర్శకులందరినీ పిలిచి ఆ వెబ్ సైట్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేస్తాం. దీనిపై త్వరలోనే అప్డేట్ ఇస్తాం..”