‘పుష్ప 2 : ది రూల్’ భారీ కలెక్షన్లు సాధించిన నేపథ్యంలో హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్, నిర్మాతలు రవి శంకర్, ఎర్నేని నవీన్ మీడియాతో ముచ్చటించారు.ఈ సందర్భంగా చేసిన ప్రసంగంలో అల్లు అర్జున్ ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి కృతజ్ఞతలు తెలపడం అందరినీ ఆకర్షించింది.
గత కొంతకాలంగా అల్లు అర్జున్ కి, మెగా కుటుంబానికి దూరం పెరిగింది అని తెలిసిన విషయమే. “పుష్ప 2” విడుదల అయ్యాక ఆ సినిమాని ఎక్కువగా ట్రోల్ చేసింది కూడా పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, మెగాస్టార్ చిరంజీవి అభిమానులే. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ తనకు వరుసకు మామయ్య అయ్యే పవన్ కళ్యాణ్ కి ప్రత్యేకంగా కృతజ్ణతలు తెలిపారు.
“ఇలాంటి విజయం సాధించడానికి కారణం దర్శకుడు. కాబట్టి మా దర్శకుడు సుకుమార్ కి ధన్యవాదాలు. నన్ను ఒక స్థాయిలో పెట్టినందుకు సుకుమార్ కి రుణపడి ఉంటాను. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, సినిమాటోగ్రఫీ మినిష్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, అదే విధంగా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉపముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్ బాబాయ్ గారికి, సినిమాటోగ్రఫీ కందుల దుర్గేష్ గారికి ధన్యవాదాలు,” అని అందరికీ థాంక్స్ చెప్పారు బన్నీ.
“అనుకోకుండా సంధ్య థియేటర్లో జరిగిన సంఘటన మమ్మల్ని ఎంతగానో కదిలించింది. గత 20 సంవత్సరాలుగా ఇలాగే వెళ్తున్నాం కానీ ఆరోజు కొంచం ఎక్కువ జనం ఉండటంతో ఇబ్బంది అవుతుంది అని థియేటర్ యాజమాన్యం చెప్పగానే వెళ్ళిపోయాం. కానీ ఇంటికి వచ్చిన తరువాత రోజు జరిగిన సంఘటన తెలిసి చాల బాధ కలిగింది. మరొకసారి చెప్తున్నాను ఆ కుటుంబం కోసం 25 లక్షలు కేవలం ఒక సాయంగా అనుకుని ఇస్తున్నాం. అయినా ఒక మనిషి లేని లోటు ఎవరు తీర్చలేం. అందుకు ఎంతో విచారిస్తున్నాను. కుదుటపడిన తరువాత వ్యక్తిగతంగా వెళ్లి ఆ కుటుంబాన్ని కలుస్తాను” అని తెలిపారు అల్లు అర్జున్.