“డీజే టిల్లు” అనుకోకుండా పెద్ద హిట్ అయింది. అట్లుంటది మనతోటి అనే పదం బాగా పాపులర్ అయింది. ఆ సినిమా సిద్ధూ జొన్నలగడ్డని స్టార్ ని చేసింది. దానికి సీక్వెల్ గా రూపొందిన “టిల్లు స్క్వేర్” అనేకసార్లు వాయిదాలు పది, అనేక రీషూట్లు చేసుకొని విడుదలైంది. ఇది మరింత భారీ విజయం సాధించింది. అమెరికాలో ఏకంగా 3 మిలియన్ల డాలర్లను పొందుతోంది. ఈ నేపథ్యంలో సిద్ధూతో ముచ్చట్లు…
డీజే టిల్లు హిట్టు, టిల్లు స్క్వేర్ హిట్టు. మరి ఈ ఫ్రాంచైజీని కొనసాగిస్తారా?
అవును. ఆ ఆలోచన ఉంది. “టిల్లు స్క్వేర్” తీస్తున్నప్పుడు మూడో భాగం గురించి అనుకోలేదు. కానీ ఇప్పుడు వచ్చిన స్పందన చూసి మా నిర్మాత నాగవంశీ ఇప్పటికీ ఈ ఫ్రాంచైజీని కొనసాగిస్తామని ప్రకటించారు. మూడో పార్ట్ గురించి కొన్ని ఐడియాలు ఉన్నాయి కానీ వాటిని ఇంకా పూర్తిగా ఆలోచించలేదు.
దర్శకుడిని మార్చడం హెల్ప్ అయిందా?
మొదటి చిత్రానికి విమల్ కృష్ణ అద్భుతంగా చేశారు. రెండో చిత్రానికి ఆయనని కాకుండా మల్లిక్ రామ్ ని తీసుకోవడంతో మొదట చాలా మంది ఈ సినిమా ఔట్ ఫుట్ పై డౌట్స్ రెయిజ్ చేశారు. కానీ మల్లిక్ రామ్ కూడా అద్భుతంగా చేశాడు అని అందరూ ఇప్పుడు ప్రశంసిస్తున్నారు కదా.
ఈ సినిమాతో పెద్ద హిట్ కొట్టాలన్న నెరవేరింది కదా!
అవును. మూడు, నాలుగేళ్లల్లో 100 కోట్ల సినిమా డెలివరీ చెయ్యాలనుకున్నాను. అది ఈ సినిమాతోనే నెరవేరడం అదృష్టం.
నెక్స్ట్ చిత్రాలు ఇలాగే ఫన్నీగా ఉంటాయా?
ప్రస్తుతం నేను “తెలుసు కదా” అనే సినిమాలో నటిస్తున్నాను. నీరజ కోన దర్శకురాలు. అది లవ్ స్టోరీ. ఇక బొమ్మరిల్లు భాస్కర్ తీస్తున్న “జాక్” వేరే జానర్. భాస్కర్ సినిమాలో చాలా ఫన్ ఉంటుంది కానీ “టిల్లు” స్టయిల్ లో ఉండదు.