నాని హీరోగా నటించిన మరో చిత్రం… సరిపోదా శనివారం. ఈ సినిమా ఈ నెల 29న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా మీట్ లో అనేక ప్రశ్నలకు నాని సమాధానం ఇచ్చాడు. అందులోని ప్రధాన అంశాలు…
సరిపోదా గ్యారెంటీ హిట్
“సరిపోదా శనివారం” గ్యారెంటీగా ఆడుతుంది. ఫైనల్ కాపీ చూసిన తర్వాత చెప్తున్న మాట ఇది. నిర్మాత దానయ్య గారు ‘ఆర్ఆర్ఆర్’ లాంటి భారీ విజయం చూశారు. ఆ సక్సెస్ చూసిన తర్వాత అంత తొందరగా ఏదీ ఆనదు. కానీ ఇది ఆనుతుందనే నమ్మకం వుంది. నాకు కోపం వచ్చింది, నాకు కోపం వచ్చిందంటే బ్లాక్ బస్టర్ కన్ ఫర్మ్ అవ్వాల్సిందే.
చంటబ్బాయ్ చెయ్యను
“నాగ్ అశ్విన్, నేను కలిసి అనుకున్నాం. చంటబ్బాయ్ లాంటి ఓ సినిమా చేయాలనుకున్నాం. కానీ ఏజెంట్ సాయిశ్రీనివాస్ ఆత్రేయ రూపంలో నవీన్ పొలిశెట్టి చేసేశాడు. దాంతో అటువైపు మనసు వెళ్లలేదు. కానీ చంటబ్బాయ్ సినిమా నా ఫేవరెట్ సినిమాల్లో ఒకటి. నా అభిప్రాయం ప్రకారం చంటబ్బాయ్ లాంటి సినిమాను కరెక్ట్ గా చేస్తే ఇప్పుడు కూడా పెద్ద హిట్టవుతుంది.”
బలగం వేణుతో సినిమా ఉంటుంది
“వేణు తీసిన బలగం నాకు బాగా నచ్చింది. ఈ దశాబ్దంలోనే బెస్ట్ సినిమాల్లో ఒకటి. ఆ సినిమాకి నేను మొదటి నుంచి మద్దతు ఇచ్చాను. దాంతో వేణు నాతో సినిమా తీయాలను అనుకున్నాడు. ఒక ఐడియా చెప్పాడు. దిల్ రాజు గారి నిర్మాణంలో చేద్దామని అనుకున్నాం. మాట వరుసకు అనుకున్న ఆ ఆలోచన మీడియాలోకి వచ్చింది. కానీ వెంటనే చెయ్యాలని ప్లాన్ చెయ్యలేదు. వేణు, దిల్ రాజు, నా కాంబినేషన్లో సినిమా ఉంది. ఉంటుంది. ఐతే అది ఎప్పుడు చెయ్యాలి అనేది ఇంకా ఫిక్స్ కాలేదు.”