“డబుల్ ఇస్మార్ట్’ చిత్రంలో రామ్ పోతినేని సరసన కావ్య థాపర్ నటించింది. ఆమె గ్లామర్ పాత్రలకు పెట్టింది పేరు. రవితేజ సరసన “ఈగిల్”, సంతోష్ శోభన్ తో “ఏక్ మిని కథ”, సందీప్ కిషన్ తో “ఊరు పేరు భైరవకోన”లో నటించింది. ఇప్పుడు పూరి తీసిన “డబుల్ ఇస్మార్ట్”లో తన పాత్ర చాలా బోల్డ్ గా ఉంటుంది అని చెప్తోంది. ఆమెతో ఇంటర్వ్యూ…
‘డబుల్ ఇస్మార్ట్’ గురించి…
పూరి గారి హీరోయిన్ గా కనిపించాలనేది మొదటి నుంచి కల ఉంది. ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాకి ఆడిషన్ ఇచ్చాను. అప్పుడు అవకాశం రాలేదు. మళ్ళీ ఈ సినిమాకి ఆడిషన్ ఇచ్చాను. సెలెక్ట్ అయ్యాక కొంచెం వెయిట్ తగ్గమని చెప్పారు. రెండు నెలలు శ్రమించి బరువు తగ్గాను. ఇందులో నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. రామ్, సంజయ్ దత్, పూరి జగన్నాధ్… అందరూ పేరొందిన వాళ్ళే.
ఇందులో మీ పాత్ర ఏంటి?
నా పాత్ర చాలా బోల్డ్ గా ఉంటుంది. తెలివైన, ధైర్యవంతురాలైన అమ్మాయిగా కనిపిస్తాను. నేను ఇందులో ఫైట్స్ కూడా చేశాను. ఏ నటి అయినా కోరుకునే పాత్ర. అలాంటి మంచి పాత్ర నాకు దక్కడం నిజంగా అదృష్టమే.
పూరి, రామ్ గురించి…?
ఇక రామ్ పోతినేని వంటి ఎంతో ఎనర్జీ ఉన్న హీరోతో నటించాలంటే చాలా కష్టపడాలి. మొదట రోజు ఇబ్బందిపడ్డాను. ఆయనతో మ్యాచ్ అవ్వలేక. మూడు రోజుల విశ్రాంతి తర్వాత డబుల్ ఎనర్జీతో డ్యాన్స్ చేశాను. పూరి గారి నుంచి చాలా నేర్చుకున్నాను. ఆయన చాలా కూల్ గా ఉంటారు. కానీ ఎంతో ఫిలాసపీ ఉన్న వ్యక్తి. జీవితానికి సంబంధించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాను.
ఎలాంటి పాత్రలు ఇష్టం?
యాక్షన్ తో కూడిన పాత్రలు చెయ్యడం ఇష్టం. “డబుల్ ఇస్మార్ట్”లో కొంతమేరకు ఫైట్స్ చేశాను. కానీ ఫుల్ లెంగ్త్ అడ్వెంచర్ మూవీ, యాక్షన్ మూవీ చెయ్యాలనేది కోరిక.
తదుపరి చిత్రాలు?
గోపిచంద్ గారితో ‘విశ్వం’ చేస్తున్నాను.