
వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్నాడు నితిన్. ఓవైపు అలా ఫ్లాపులొస్తున్నాయి. మరోవైపు ‘తమ్ముడు’ సినిమా బడ్జెట్ పెరిగిపోయింది. అందుకే రెమ్యూనరేషన్ విషయంలో బెట్టు చేయలేదు. “అంకుల్ మీకు ఎంత ఇవ్వాలనిపిస్తే అంత ఇవ్వండి” అంటూ దిల్ రాజుకు కబురు పెట్టాడు.
మొత్తానికి చాలా తక్కువ పారితోషికం తీసుకున్నాడు నితిన్. సినిమా హిట్టయితే అతడికి మరికొంత ముట్టేది. కానీ డిజాస్టర్ అవ్వడంతో, నితిన్ కు అదే ఫైనల్ పేమెంట్ గా మారింది.
ఇప్పుడు అసలు విషయానికొస్తే.. ఈ హీరో తన నెక్ట్స్ సినిమాకు ఒక్క రూపాయి కూడా పారితోషికం తీసుకోవడం లేదంట. తన తదుపరి చిత్రాన్ని కూడా దిల్ రాజు బ్యానర్ లోనే చేస్తున్నాడు నితిన్. దాని పేరు ‘ఎల్లమ్మ’. బలగం వేణు దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా కోసం తనకు డబ్బులు వద్దని చెప్పేశాడట నితిన్.
‘తమ్ముడు’ సినిమాకు విడుదలకు ముందు పాక్షికంగా పేమెంట్ తీసుకున్న ఈ హీరో, ‘ఎల్లమ్మ’ సినిమాకు మాత్రం సక్సెస్ అయిన తర్వాత పేమెంట్ తీసుకుంటానని, లేకపోతే ఒక్క పైసా కూడా వద్దని నిర్మాతకు చెప్పేశాడట. ప్రస్తుతానికి ఇది పుకారే అయినప్పటికీ, నిజమయ్యే అవకాశాలే ఎక్కువ. ఎందుకంటే, నితిన్ కు ఇప్పుడు పారితోషికం కంటే సక్సెస్ అవసరం.















