
సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ సంస్కృతి చాలా కాలంగా కొనసాగుతోంది. ఐతే, ఇటీవల కాలంలో సమాజం మారింది, సినిమా పరిశ్రమ మారింది. ఈ వికారం తగ్గింది. మొత్తంగా పోయింది అనలేం కానీ తెలుగు, బాలీవుడ్ వంటి చిత్రసీమల్లో ప్రొఫెషనలిజం పెరిగి, ఆ విష సంస్కృతి చాలా వరకు మరుగున పడింది. కానీ ఎంతో గొప్పగా చెప్పుకునే మలయాళ చిత్రసీమలో లైంగిక వేధింపులు ఎక్కువ. ఆ విషయం సినిమా ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. ఇప్పుడు అధికారికంగా దేశంలో అందరికీ తెలిసిపోయింది.
చిత్రసీమలో లైంగిక వేధింపుల అధ్యయనం కోసం కేరళ రాష్ట్ర ప్రభుత్వం కమీషన్ వేసింది. ఇలాంటి కమీషన్ ఏర్పాటు మనదేశంలో ఇదే ప్రథమం. ఆ విషయంలో కేరళ ప్రభుత్వం మొదటి అడుగు వెయ్యడం అభినందించదగ్గ విషయం. 2018లో జస్టిస్ రేఖ కమీషన్ ని ఏర్పాటు చేసింది కేరళ ప్రభుత్వం. ఇప్పుడు ఆ కమీషన్ రిపోర్టుని బయటపెట్టింది.
ఈ కమీషన్ నివేదికలో ఎన్నో సంచలన విషయాలు ఉన్నాయి. అందులో ప్రధాన అంశాలు చూద్దాం…
“మలయాళ చిత్రసీమలో ఎంతో పేరొందిన హీరోలు, నిర్మాతలు, దర్శకుల ముఠా ఒకటి ఉంది. ఇది ఒక మాఫియాలా పనిచేస్తోంది. తమ మాట వినని వారిని, లొంగని వారిని వేధింపులకు గురి చేస్తోంది ఈ మాఫియా”
“కాంప్రమైజ్, అడ్జెస్ట్ మెంట్ గురించి ముందే ఒప్పందం చేసుకుంటున్నారు. పడుకుంటేనే ఆఫర్లు ఇచ్చే పద్దతి బలంగా ఉంది ఇక్కడ. పడుకుంటే ఆఫర్లు ఇస్తామని చెప్పడానికి పెట్టిన కోడ్ వర్డ్స్… కాంప్రమైజ్, అడ్జెస్ట్ మెంట్. సినిమా ఒప్పుకునే ముందే హీరోయిన్ కి చెప్పి నటింప చేస్తున్నారు.”
“పెద్ద హీరోయిన్లకు ఈ సమస్య తక్కువే. కానీ కొత్త అమ్మాయిలకు, చిన్న నటీమణులకు ఈ సమస్య ఉంది.”
“ఒక పెద్ద దర్శకుడు ఒక హీరోయిన్ పై, హీరోపై చాలా రొమాంటిక్ గా సన్నివేశాలు తీశాడు. వాటిని తొలగించమని అడిగిన హీరోయిన్ ని ముప్పతిప్పలు పెట్టారు. వేధించారు.”
“ఒక హీరోయిన్ పడుకోవడానికి ఒప్పుకోకపోతే ఆమె ఇంటికి అర్ధరాత్రి కొందరు దుండగలు వెళ్లి బెల్ కొట్టి వేధిస్తారు. వారిని పంపేది పైన చెప్పిన మలయాళ సినిమా మాఫియా ముఠా.”
“ఎంత పెద్ద నిర్మాణ సంస్థ అయినా అవుట్ డోర్ లొకేషన్ లలో మహిళలకు కనీస వసతులు కల్పించడం లేదు. చాలా సార్లు షూటింగ్ అవుట్ డోర్ లో ఉంటే చెట్టు చాటుకు, పుట్ట చాటుకు వెళ్లి మూత్ర విసర్జన చెయ్యాల్సి వస్తోంది.”