
మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి, అల్లు అర్జున్ కుటుంబానికి దూరం పెరిగింది అనేది వాస్తవం. “పుష్ప 2” సినిమా విడుదల అనంతరం జరిగిన పరిణామాలు, అల్లు అర్జున్ పై కేసు, అరెస్ట్ వంటివి వారి మధ్య ఉన్న గొడవలు సామాన్య జనాలకు కూడా తెలిసిపోయాయి. రెండు కుటుంబాల మధ్య సంబంధాలు పూర్తిగా చెడిపోయాయి అనే విషయం పల్లెటూర్లో పశువులు కాచుకునేవాళ్లకు కూడా చేరింది.
అందుకే, “పుష్ప 2” విజయం గురించి మెగా ఫ్యామిలీలో ఎవరూ ఇంతవరకు స్పందించలేదు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి పొగిడారు. “పుష్ప 2” విజయాన్ని చూసి గర్విస్తున్నట్లుగా చిరంజీవి పేర్కొన్నారు. కొన్ని సినిమాలు ఆడుతాయి, కొన్ని పోతాయి… అది సహజం అని తన కుమారుడి ‘గేమ్ చేంజర్’ ఫ్లాఫ్ అవటం గురించి మాట్లాడారు.
మొత్తానికి చిరంజీవి ‘పుష్ప 2’ విజయాన్ని అంగీకరించక తప్పలేదు…కొంచెం ఆలస్యంగానైనా. ఐతే, చిరంజీవి ఇప్పుడు ఈ సినిమా విజయం గురించి మాట్లాడడం అభిమానులకు నచ్చలేదు. జనమే “పుష్ప 2” గురించి మర్చిపోతున్నప్పుడు ఆయన ఎందుకు ఆ సినిమా గురించి ప్రస్తావించారో అంటూ ఫ్యాన్స్ చిరాకుపడుతున్నారు.
చిరంజీవి ప్రస్తుతం ‘విశ్వంభర’ సినిమాతో బిజీగా ఉన్నారు. త్వరలో అనిల్ రావిపూడి డైరెక్షన్లో ఒక మూవీ, శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో మరో మూవీ చేస్తారు.