అనిరుధ్ రవిచందర్ ఇప్పుడు అగ్ర సంగీత దర్శకుడు. సినిమాకి ఏడు నుంచి పది కోట్ల పారితోషికం తీసుకొనే సంగీత చిచ్చరపిడుగు. తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్, విజయ్, కమల్ హాసన్ వంటి అగ్ర హీరోలకు తప్పనిసరిగా మారిన మ్యూజిక్ సెన్సేషన్.
తెలుగులో పవన్ కళ్యాణ్, నాని వంటి హీరోలకు సంగీతం ఇంతకుముందు ఇచ్చాడు. కానీ అప్పుడు అతని పాటలను మనవాళ్ళు పెద్దగా ఆదరించలేదు. ఇప్పుడు అతని మ్యూజిక్ అంటే చెవి కోసుకుంటున్నారు. ముఖ్యంగా ఒక సినిమాని తన నేపథ్య సంగీతంతో నిలబెట్టగలడు అనేక సినిమాలతో నిరూపించాడు కాబట్టే ఇప్పుడు తెలుగు నిర్మాతలు, దర్శకులు అతని డేట్స్ కోసం ఎగబడుతున్నారు.
“దేవర” సినిమా విజయంతో అనిరుధ్ కి తెలుగులో ఇంకా క్రేజ్ పెరిగింది.
ఇప్పుడు నాని – ‘దసరా’ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో రూపొందుతోన్న సినిమా (NaniOdela2)కి సంగీతం ఇస్తున్నాడు అనిరుధ్. అలాగే, విజయ్ దేవరకొండ – ‘జెర్సీ’ గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్లో వస్తోన్న సినిమా (VD12)కి కూడా అతనే ట్యూన్స్ అందిస్తున్నాడు. “మేజిక్” (Magic) అనే మరో చిన్న సినిమాకి కూడా పాటలు ఇస్తున్నాడు.
“దేవర 2” కూడా అతని ఖాతాలోనే. అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో రానున్న సినిమాకి కూడా తమన్ స్థానంలో అనిరుధ్ వచ్చే అవకాశం ఉంది.