వన్ టు వన్ ఇంటర్వ్యూల్లో ఏది అడిగినా ఓకే. ప్రెస్ మీట్ కు పిలిచినప్పుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. నలుగురి దృష్టిలో పడడం కోసం, సంచలనాల కోసం ఏది పడితే అది అడగడం ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది.
తాజాగా జరిగిన ఓ ప్రెస్ మీట్ లో ఓ మహిళా జర్నలిస్ట్, హీరోయిన్ అనన్య నాగళ్లను కాస్టింగ్ కౌచ్ గురించి అడిగింది. కాస్టింగ్ కౌచ్ గురించి అడగడంలో తప్పు లేదు కానీ అడిగే విధానం ఒకటి ఉంటుంది కదా. ఈ విషయంలో సదరు మహిళా జర్నలిస్ట్ హద్దులు దాటింది.
“నా ఫ్రెండ్స్ చెప్పారు, కమిట్ మెంట్ ఇస్తేనే హీరోయిన్ ఆఫర్ ఇస్తారంటగా”, “నాకు చాలామంది చెప్పారు, కమిట్ మెంట్ ఇవ్వకపోతే రేటు తగ్గిస్తారంటగా”…. ఇవి ఆ అమ్మాయి అడిగిన ప్రశ్నలు. వీటికి అనన్య దీటుగా సమాధానమిచ్చింది. ప్రతి పరిశ్రమలో ఉన్నట్టుగానే, టాలీవుడ్ లో కూడా మంచి-చెడు ఉంటాయని, చెడువైపే ఎందుకు చూస్తున్నారని ప్రశ్నించింది.
“మీరు (మహిళా జర్నలిస్ట్) ఎవరో చెబితే కాస్టింగ్ కౌచ్ ఉందని ఆరోపిస్తున్నారు. నేను హీరోయిన్ గా ఇండస్ట్రీలో ఉన్నాను, పరిస్థితుల్ని ఫేస్ చేస్తున్నాను, నేను చెబుతున్నాను, ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ లేదు.” అంటూ గట్టిగా సమాధానమిచ్చింది అనన్య నాగళ్ల.
ఒకప్పట్లా మీడియా ప్రతినిధులు ఏదైనా మాట్లాడొచ్చు అనుకుంటే పొరపాటు. సోషల్ మీడియా గమనిస్తోంది. ఏమాత్రం తేడాగా అనిపించినా, మీడియా ప్రతినిధులని కూడా చూడకుండా ట్రోలింగ్ చేస్తోంది. పేర్లు ప్రస్తావించడం అప్రస్తుతం కానీ, ఇప్పటికే ఇద్దరు ముగ్గురు మీడియా ప్రతినిధులపై ఓ రేంజ్ లో ట్రోలింగ్ జరిగింది.
ఇప్పటికీ ఓ మీడియా ప్రతినిధిని పుట్టుమచ్చల జర్నలిస్ట్ అని సంభోధిస్తుంది సోషల్ మీడియా. ఇలా సోషల్ మీడియా నిఘా గట్టిగా ఉన్న ఈ తరుణంలో జర్నలిస్టులు బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది