
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం మారింది. ఇప్పుడు తెలుగులో అల్లు అర్జున్, ప్రభాస్, ఎన్టీఆర్ వంటి హీరోలకు, తమిళంలో అజిత్, విజయ్ సినిమాల ఓపెనింగ్స్, కలెక్షన్లు రజినీకాంత్ సినిమాల కన్నా ఎక్కువ ఉంటాయి. అలాగే, “కబాలి” తర్వాత రజినీకాంత్ రాజకీయాల వైపు మొగ్గు చూపడం, బీజేపీతో అంటకాగడంతో ఆయన మార్కెట్ తమిళనాట బాగా పడిపోయింది.
ఐతే, ఎప్పుడైతే రజినీకాంత్ రాజకీయాలకు దూరం అని ప్రకటించారో అప్పటి నుంచి మళ్ళీ స్వింగ్ లోకి వచ్చారు. అలా “జైలర్”తో మరోసారి తన క్రేజ్, తన స్థాయి ఏంటో నిరూపించారు. ఐతే ఆ తర్వాత వచ్చిన సినిమా మాత్రం తుస్సుమంది. మళ్ళీ ఇప్పుడు “కూలీ”తో అదరగొడుతున్నారు.
“కూలీ” సినిమా విడుదలకి 15 రోజుల పైనే ఉంది. కానీ అప్పుడే అమెరికాలో ప్రీమియర్ షో అడ్వాన్స్ బుకింగ్స్ మాములుగా లేవు. అర మిలియన్ డాలర్ మార్క్ దాటిపోయింది. ఒక్క ప్రీమియర్ షోతోనే ఈ సినిమా అమెరికాలో రెండు మిలియన్ డాలర్లు పొందేలా ఉంది. దాంతో, మరోసారి రజినీకాంత్ తన సూపర్ స్టార్డం ఏంటో చూపిస్తున్నాడు అని అంటున్నారు.
ఒకవైపు, ఈ సినిమాకి పోటీగా హృతిక్ రోషన్, ఎన్టీఆర్ నటించిన “వార్ 2” విడుదల అవుతోంది. ఆ సినిమా ఓపెనింగ్స్ రజినీకాంత్ సినిమాతో పోల్చితే చాలా తక్కువ ఉండేలా ట్రెండ్ సాగుతోంది.















